టీ20లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

టీ20లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు గత కొన్నేండ్లుగా టీమిండియాకు వెన్నెముకలా ఉన్నారు. లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. వీరిద్దరిలో ఒకరు క్రీజ్ లో కుదురుకున్నా ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.  ఈ ఇద్దరు దిగ్గజాలు ఫామ్ లో ఉన్నప్పటికీ భవిష్యత్తు క్రికెటర్లను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ జోడీ హాలీ క్రికెట్ నుంచి విరామం తీసుకొని డే ట్రిప్ లో ఉన్నారు. 

కోహ్లీ లండన్ వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. రోహిత్ సైతం అతని కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లినట్టు సమాచారం. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరిద్దరూ మైదానంలో ఎప్పుడు అడుగుపెడతారో అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. వీరిద్దరినీ గ్రౌండ్ లో చూడాలని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారత్ జింబాబ్వేతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ జూలై 14 న ముగుస్తుంది. జూలై నెలాఖరులో శ్రీలంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టు 2 నుంచి లంకతో మూడు వన్డేల సిరీస్ సిరీస్ మొదలవుతుంది. 

శ్రీలంక ఎప్పుడూ లేని విధంగా బలహీనంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో లంక పర్యటనకు విరాట్, రోహిత్ లను పంపకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరిని ఈ సిరీస్ కు ఎంపిక చేయవచ్చు. ఈ మెగా టోర్నీ ప్రారంభమయ్యే సరికీ వీలైనన్ని ఎక్కువ వన్డేలు అందించాలని బీసీసీఐ భావిస్తోందట. అదే జరిగితే కోహ్లీ, రోహిత్ లను శ్రీలంకతో వన్డే సిరీస్ లో చూడొచ్చు. ఒకవేళ ఈ సిరీస్ కు ఈ ఇద్దరు అందుబాటులో లేకపోతే సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ వరకు ఆగాల్సిందే.

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్:

  • మొదటి టీ20: జూలై 27న శనివారం
  • రెండో టీ20: జూలై 28న ఆదివారం
  • మూడో టీ20: జూలై 30న మంగళవారం
  • మొదటి వన్డే: ఆగస్టు 2న శుక్రవారం
  • రెండో వన్డే: ఆగస్టు 4న ఆదివారం
  • మూడో వన్డే: ఆగస్టు 7న బుధవారం