- అఫ్గాన్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్
- గాయాలతో హార్దిక్, సూర్యకుమార్ దూరం
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత 14 నెలలుగా షార్ట్ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరూ అఫ్గానిస్తాన్‌తో ఈ నెల 11న మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్ కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదివారం 16 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది.
రోహిత్‌కు తిరిగి కెప్టెన్సీ అప్పగించింది. హిట్‌మ్యాన్ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న టైమ్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే, గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కు దూరమైన హార్దిక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్‌లో కూడా పాల్గొనడం లేదు. ఈ ముగ్గురూ గాయాల నుంచి కోలుకుంటున్నారు. కేఎల్ రాహుల్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు, తన ఆటపై ఫోకస్ పెట్టేందుకు బ్రేక్ అడిగిన ఇషాన్ కిషన్‌ను కూడా తీసుకోలేదు.
దాంతో కీపర్లుగా యంగ్‌స్టర్ జితేష్‌తో పాటు సంజు శాంసన్‌ను తీసుకున్నారు. పాండ్యా లేకపోవడంతో ముంబై ఆల్‌రౌండర్ శివం దూబేకు మళ్లీ నేషనల్ టీమ్‌లో చాన్స్ లభించింది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా, జడేజాకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు ఇండియా ఆడే చివరి సిరీస్ ఇదే. ఈ నెల 11న మొహాలీలో తొలి టీ20, 14న ఇండోర్‌లో రెండో మ్యాచ్, 17న బెంగళూరులో చివరి పోరు జరుగుతాయి.
వరల్డ్ కప్ కోసమే
2022 నవంబర్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్, కోహ్లీ ఇండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఆ రెండు ఫార్మాట్లపైనే ఫోకస్ పెట్టారు. దాంతో సెలెక్టర్లు హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించి స్టార్ ప్లేయర్ల స్థానాల్లో పలువురు కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో యశస్వి, తిలక్, రింకూ, తదితరులు తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఇక పాండ్యా గాయపడటంతో ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్, గత నెల సౌతాఫ్రికాలో మూడు టీ20ల సిరీస్‌లో సూర్య టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహించాడు. ఇప్పుడు పాండ్యాతో పాటు సూర్య కూడా గాయపడ్డాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌తోనే రీఎంట్రీ ఇచ్చే చాన్సుంది.
మరోవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడంతో రోహిత్, కోహ్లీ మరో ఐసీసీ ఈవెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడయ్యారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా తమను కలిసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఈ విషయం స్పష్టం చేశారు. దాంతో ఇద్దరు సూపర్ స్టార్లను సెలెక్టర్లు షార్ట్ ఫార్మాట్‌లోకి తిరిగి ఎంపిక చేశారు. అయితే, జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడా? అన్నది తేలాల్సి ఉంది.
టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేష్ కుమార్.