Rohit Sharma: హిట్‌మ్యాన్ దెబ్బకు కెవ్వుమన్న బాబర్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త రికార్డు

Rohit Sharma: హిట్‌మ్యాన్ దెబ్బకు కెవ్వుమన్న బాబర్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త రికార్డు

గురువారం(జూన్ 27) గయానా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసి.. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంది. అప్పటి పోరులో బట్లర్ సేన 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడిస్తే.. ఇప్పుడు రోహిత్ టీమ్ భారీ విజయం సాధించి.. ఆ ఓటమి ఖాతాను సమం చేసింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును అధిరోహించాడు. 

ఇంగ్లాండ్‌పై విజయం.. భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు 49వది. అంతర్జాతీయ టీ20ల్లో ఏ కెప్టెన్‌కైనా ఇదే అత్యధికం. తద్వారా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీప్రారంభానికి ముందు రోహిత్ 42 విజయాలతో ఉండగా.. భారత జట్టు ఏడు విజయాలతో అజేయంగా ఉన్నందున అగ్రస్థానానికి చేరుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20Iల్లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు

  • రోహిత్ శర్మ (భారత్): 61 మ్యాచ్‌ల్లో 49 విజయాలు
  • బాబర్ అజామ్ (పాకిస్థాన్): 85 మ్యాచ్‌ల్లో 48 విజయాలు
  • బ్రియాన్ మసాబా (ఉగాండా): 60 మ్యాచ్‌ల్లో 45 విజయాలు
  • ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్): 71 మ్యాచ్‌ల్లో 44 విజయాలు
  • అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్): 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు
  • ఎంఎస్ ధోని (భారత్): 72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు 
  • ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 76 మ్యాచ్‌ల్లో 41 విజయాలు

రోహిత్@5000

ఈ మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ధోనీ (11,207), మహమ్మద్ అజారుద్దీన్ (8,095), సౌరవ్ గంగూలీ (7,643), రోహిత్ కంటే ముందున్నారు.