బంగ్లా కోసం కొత్త ప్లాన్‌‌‌‌ అవసరం లేదు : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

బంగ్లా కోసం కొత్త ప్లాన్‌‌‌‌ అవసరం లేదు :  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
  • పేసర్ల పనిభారంపై ఫోకస్ పెడతాం 

చెన్నై: పాకిస్తాన్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌స్వీప్ చేసి బంగ్లాదేశ్‌‌ జోరుమీద ఉన్నా, ఆ జట్టు పేసర్‌‌‌‌‌‌‌‌ నహిద్ రాణా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ బంగ్లా కోసం పూర్తిగా భిన్నమైన  వ్యూహాన్ని  రూపొందించాల్సిన అవసరం లేదని ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ సీజన్‌‌లో ఇండియా పది టెస్టులు ఆడనున్న నేపథ్యంలో పేసర్లపై ఎక్కువ పనిభారం లేకుండా చూసుకుంటామని చెప్పాడు. సీనియర్ బ్యాటర్‌‌‌‌ కేఎల్‌‌ రాహుల్ స్పిన్, పేస్‌‌ను మెరుగ్గా ఎదుర్కొంటాడన్న హిట్‌‌మ్యాన్‌‌  గురువారం మొదలయ్యే తొలి టెస్టులో అతను తుది జట్టులో ఉంటాడని హింట్ ఇచ్చాడు. ‘ప్రతీ జట్టూ ఇండియాను ఓడించాలని ఆశిస్తుంది. 

మన జట్టుపై గెలవడాన్ని  గౌరవంగా భావిస్తుంది.  బంగ్లా కూడా అదే ఆశతో ఉంది. మా ఆలోచన మ్యాచ్‌‌‌‌లు ఎలా నెగ్గాలన్నదానిపైనే ఉంటుంది తప్ప ప్రత్యర్థి జట్టు మా గురించి ఏం ఆలోచిస్తుంది అన్నదానిపై కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో ఇండియా క్రికెట్ ఆడింది. కాబట్టి ఇప్పుడు మొత్తం కొత్త ప్రణాళికను ( బంగ్లా కోసం) రచించాల్సిన అవసరం లేదు. బంగ్లా జట్టులో ఒకరిద్దరు కొత్త ప్లేయర్లు వచ్చి బాగా ఆడుతున్నారు. కానీ,  మేం ఆ ఆటగాళ్ల గురించి మాత్రమే కాకుండా మొత్తం ప్రత్యర్థి గురించి ఆలోచించి ముందుకెళ్తాం. మా ఆటపై దృష్టి పెడతాం’ అని రోహిత్ మంగళవారం మీడియాతో చెప్పుకొచ్చాడు. 

అందరూ అన్నీ ఆడటం సాధ్యం కాదు

వరుస టెస్టుల నేపథ్యంలో బౌలర్లు ముఖ్యంగా పేసర్ల పని భారాన్ని మేనేజ్‌ చేయడం అత్యంత ముఖ్యమైన విషయమని  రోహిత్ చెప్పాడు. ‘మన బెస్ట్ ప్లేయర్లు అన్ని మ్యాచ్‌‌‌‌ల్లో ఆడాలనే ఆశిస్తాం.  కానీ, ఎక్కువ మ్యాచ్‌‌‌‌లు ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. ఈ సీజన్‌‌‌‌లో టెస్టులు మాత్రమే కాకుండా మధ్యలో టీ20 క్రికెట్ కూడా ఆడాల్సి ఉంది. కాబట్టి బౌలర్లపై అతిగా భారం పడకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఓ ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని రోహిత్ తెలిపాడు.  

కేఎల్‌‌‌‌కు స్పష్టమైన సందేశం ఇచ్చాం

గాయాలు, నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న  స్టార్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌కు  తమ నుంచి స్పష్టమైన సందేశం ఇచ్చామని  తెలిపాడు. ‘కేఎల్‌‌‌‌ ఎంత నాణ్యమైన ఆటగాడో అందరికీ తెలుసు. మా వైపు నుంచి అతనికి ఓ స్పష్టమైన సందేశం ఇచ్చాం. తను అన్ని మ్యాచ్‌‌‌‌ల్లో ఆడాలని, తన అత్యుత్తమ ఆటను చూపెట్టాలని అనుకుంటున్నాం. అతని నుంచి అత్యుత్తమ ఆట రాబట్టడం మా కర్తవ్యం కూడా. కేఎల్‌‌‌‌  స్పిన్‌‌‌‌తో పాటు సీమర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. తనకు ఇప్పుడు అవకాశాలు కూడా లభిస్తాయి’ అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇక, మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌‌‌, అప్పటి సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ పనితీరుతో పోలిస్తే ప్రస్తుతం గంభీర్, ఇతర కోచ్‌‌‌‌ల శైలి పూర్తి భిన్నంగా ఉందని రోహిత్ చెప్పాడు. గంభీర్‌‌‌‌‌‌‌‌తో మంచి అనుబంధం ఉన్నందున ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని తెలిపాడు.