IND vs ENG: హిట్ మ్యాన్‌తో మాములుగా ఉండదు.. గేల్, ద్రవిడ్, సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్

IND vs ENG: హిట్ మ్యాన్‌తో మాములుగా ఉండదు.. గేల్, ద్రవిడ్, సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్

టీమిండియా కేటాయిం రోహిత్ శర్మ ఒక్క ఇన్నింగ్స్ తో విమర్శకులకు చెక్ పెట్టాడు. కటక్ లో ఇంగ్లాండ్ తో ఆదివారం (ఫిబ్రవరి 9) జరిగిన రెండో వన్డేలో మెరుపు సెంచరీతో దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని పాత హిట్ మ్యాన్ ను మరోసారి గుర్తు చేశాడు.    హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో  రోహిత్ కు ఇది 32వ సెంచరీ కాగా ఈ ఫార్మాట్ లో అతనికి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ ఒక్క మ్యాచ్ లో రోహిత్ ఏకంగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్ల రికార్డ్స్ బ్రేక్ చేశాడు. 

30 ఏళ్ళ తర్వాత అత్యధిక సెంచరీలు:

ఎవరికైనా 30 ఏళ్ళు వస్తే క్రమంగా ఫామ్ తగ్గుతూ వస్తుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇందుకు భిన్నం. హిట్ మ్యాన్ 30 ఏళ్ళ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. రోహిత్ 30 ఏళ్ళ తర్వాత 36 సెంచరీలు బాదాడు. ఈ లిస్టులో 35 సెంచరీలతో టాప్ లో ఉన్న సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. రాహుల్ ద్రవిడ్ 26 సెంచరీలతో మూడో స్థానంలో.. కోహ్లీ 19 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

రాహుల్ ద్రవిడ్ రికార్డ్ ఔట్:

కటక్ వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ వన్డేల్లో అత్యధిక పరుగులు (10987) చేసిన ఆటగాళ్ల లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్(10768) ను వెనక్కి నెట్టాడు. తొలి మూడు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (18426), విరాట్ కోహ్లీ (13911),గంగూలీ (11221) ఉన్నారు.  రోహిత్ మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో 11 వేల పరుగుల క్లబ్ లో చేరతాడు. మరో 235 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీని అధిగమించి మూడో స్థానంలో నిలుస్తాడు. 

యూనివర్సల్ బాస్ రికార్డ్ బ్రేక్:    

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ గేల్ ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. గేల్ వన్డే కెరీర్ లో 331 సిక్సర్లు ఉంటే 338* సిక్సులతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు గేల్ తో సమానం ఉన్న రోహిత్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అట్కిన్సన్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి గేల్ ను అధిగమించాడు. పాకిస్థాన్ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిది వన్డేల్లో 351 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రోహిత్ మరో 14 సిక్సులు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు.