వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న(నవంబర్ 15) న న్యూజిలాండ్ పై జరిగిన మొదటి సెమీ ఫైనల్లో 70 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. కివీస్ బ్యాటర్లు బయపెట్టినా కీలక దశలో భారత బౌలర్లు ఒత్తిడి అధిగమించి రాణించడంతో 12 ఏళ్ళ తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో భారత్ ఈ మెగా టోర్నీలో వరుసగా 10 విజయాలను సాధించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును ఎంత అద్భుతంగా నడిపించాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో భారత్ కెప్టెన్ గా ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక విజయాలను అందుకున్న తొలి భారతీయ కెప్టెన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2003 వన్డే వరల్డ్ కప్ లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ వరుసగా 8 విజయాలను అందుకుంది. రోహిత్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో వరుసగా 10 విజయాలతో ఈ రికార్డ్ ను అధిగమించేసాడు. ఈ లిస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 లో 11 విజయాలను నమోదు చేసింది. ఈ రెండు వరల్డ్ కప్ లో ఆసీస్ కు ఒక్క ఓటమి కూడా ఎదురు కాకపోవడం విశేషం.
నవంబర్ 19 న ఆదివారం జరగనున్న ఫైనల్లో టీమిండియా గెలిస్తే ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్ గా పాంటింగ్ రికార్డ్ ను రోహిత్ సమం చేస్తాడు. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ ను చూస్తుంటే రోహిత్ ఖాతాలో ఈ రికార్డ్ వచ్చి చేరేలా కనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ కు ఆసియా కప్ అందించిన హిట్ మ్యాన్ వన్డే వరల్డ్ కప్ కూడా అందిస్తే కెప్టెన్ గా మరిన్ని రికార్డులు తన పేరిట వచ్చి చేరడం ఖాయం.