న్యూఢిల్లీ : సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌పై వీరవిహారం చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి ఔరా అనిపించాడు. గేల్ 483 మ్యాచ్‌ల్లో 551 సిక్సర్లు కొడితే రోహిత్ 453 వన్డేల్లోనే 556 సిక్సర్లు కొట్టేశాడు. ఈ రికార్డు అందుకునే క్రమంలో తాను యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను చూసి కొంత స్ఫూర్తి పొందానని రోహిత్ చెప్పాడు. ‘యూనివర్స్ బాస్ ఎప్పుడూ యూనివర్స్ బాసే. అతని ఆట నుంచి నేను కొంత స్ఫూర్తి పొందాను. చాలా ఏళ్లుగా గేల్‌ను చూస్తూనే ఉన్నాం. బరిలోకి దిగినప్పుడల్లా అతను ఎలా సిక్సర్ల వర్షం కురిపిస్తాడో అందరికీ తెలుసు.
మా ఇద్దరి జెర్సీ నంబర్ (45) ఒకటే. సేమ్ జెర్సీ నంబర్ తన రికార్డును బ్రేక్ చేసినందుకు గేల్ సంతోషిస్తాడని అనుకుంటున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు. తన సిక్స్–హిట్టింగ్ స్కిల్స్ వెనుక ఎన్నో ఏండ్ల కష్టం ఉందని హిట్‌మ్యాన్ తెలిపాడు. ‘సిక్సర్లలో రికార్డు పక్కనబెట్టండి. అసలు ఆట ప్రారంభించినప్పుడు నేను సిక్స్‌లు కొడతాననే అనుకోలేదు. ఇన్నేండ్ల పాటు చాలా కష్టపడ్డాను. దానికి ప్రతిఫలం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనా నేను అంత త్వరగా సంతృప్తి చెందే వ్యక్తిని కాదు. నా పని కొనసాగిస్తూనే ఉంటా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.