భారత క్రికెట్లో గొడవలు మొదలయ్యాయి. మ్యాచ్ ఓడిన సందర్భాల్లో మాజీ క్రికెటర్లు చేస్తున్న దురుసు వ్యాఖ్యలపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు క్రిక్‌బ్లాగర్ పేర్కొంది. ముఖ్యంగా, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై హిట్‌మ్యాన్ బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేశారనేది వస్తున్న వార్తల సారాంశం.
అసలేం జరిగిందంటే..?
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ కెప్టెన్సీపై, అతని ఆటతీరుపై గవాస్కర్ నాన్‌స్టాప్ విమర్శలు చేశారు. ఆ విమర్శలు మన క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందే మొదలయ్యాయి. రోహిత్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో.. మొదటి టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడని బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి వారం రోజుల ముందు విషయం బయటకొచ్చింది. అలా వార్తలొచ్చాయో .. లేదో సునీల్ గవాస్కర్ మీడియా ముందు వాలిపోయారు.
రోహిత్ గైర్హాజరీని అర్థం చేసుకుంటూనే, జట్టులో రెగ్యులర్ కెప్టెన్ అవసరాన్ని ప్రస్తావించాడు. ఒకవేళ రోహిత్ తొలి మ్యాచ్ ఆడలేకపోతే, అతన్ని పూర్తిగా తప్పించి.. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలని సూచించాడు. అలా మొదలైన విమర్శల పర్వం సిరీస్ అంతటా సాగింది. రెండో టెస్టుకు జట్టులో చేరిన హిట్ మ్యాన్.. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు చేశాడు. దాంతో, గవాస్కర్ ఆ విమర్శల వేడిని మరింత పెంచాడు. టెస్టు క్రికెట్లో శర్మ భవిష్యత్తును ప్రశ్నిస్తూ, జట్టులో తన స్థానంపై అనుమానాలు ఉంటే కెప్టెన్ రిటైర్మెంట్ తీసుకోవాలని వ్యాఖ్యానించాడు.
Also Read :- శ్రీలంకపై సెంచరీ.. గవాస్కర్, లారాలను వెనక్కి నెట్టిన స్మిత్
చివరకు గవాస్కర్ మాటలను భరించలేని రోహిత్.. ఏకంగా ఆఖరి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో రోహిత్.. ఎందుకు తప్పుకున్నాడని తెలియలేదు కానీ, అసలు సంగతి ఇదని ఇప్పుడు బయటకొచ్చింది. గవాస్కర్ తనను విమర్శించాల్సిన అవసరం లేదని రోహిత్ భావించాడని, అందుకే గవాస్కర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని క్రిక్‌బ్లాగర్ పేర్కొంది.
ఫామ్ అందుకొని రోహిత్..
ఫేలవ ఫామ్‌తో సతమతవుతున్న రోహిత్ శర్మ.. దేశవాళీ క్రికెట్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. జమ్మూ& కాశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 31 పరుగులు(3,28) చేశాడు. ఇలాంటి ఆటతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఏమాత్రం రాణించగలడనేది ఇప్పుడు ఎదురవుతోన్న ప్రశ్న.