నాన్న కోసమే రోహిత్ ఆసీస్ వెళ్లలేదు
ఎట్టకేలకు నోరువిప్పిన బీసీసీఐ
11న ఫిట్ నెస్ టెస్ట్
టెస్టు సిరీస్ కు ఇషాంత్ దూరం
వన్డే టీమ్ లోకి నటరాజన్
సిడ్నీ: ఐపీఎల్ ముగిసిన తర్వాత విరాట్ అండ్ టీమ్‌తో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లలేదు అనే అంశంపై బీసీసీఐ ఎట్టకేలకు నోరు విప్పింది. రోహిత్ మాతో ఎందుకు రాలేదో ఇప్పటిదాకా తెలియదని కెప్టెన్ కోహ్లీ గురువారం కామెంట్ చేయడంతో బోర్డులో కదలిక వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కోసమే రోహిత్ ఇండియాకు వచ్చాడని బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ప్రకటించారు. అంతేకాకుండా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడని వెల్లడించారు. మరోపక్క వచ్చే నెల 11న జరిగే ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ టెస్ట్ తర్వాతే.. రోహిత్ ఆసీస్ వెళతాడా లేదా అనేది తెలుస్తుందని జైషా పేర్కొన్నారు. ‘అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసుకోవడం కోసం రోహిత్ శర్మ ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై వచ్చాడు. అతని తండ్రి ఆరోగ్యం కుదుటపడటంతో వెంటనే బెంగళూరులోని ఎన్‌సీఏకి వెళ్లి రిహాబిలిటేషన్ స్టార్ట్ చేశాడు. రిహాబిలిటేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 11న అతనికి ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. రోహిత్ .. బోర్డర్-–గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళతాడా లేదా అనేది ఆ రిజల్ట్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక, పక్కటెముకల్లో గాయం నుంచి ఇషాంత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌కు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. దాంతో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు’ అని జైషా శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, రిహాబిలిటేషన్ కోసం ఎన్‌సీఏకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ తన తండ్రి అనారోగ్యం గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, డిసెంబర్ 17 నుంచి ఇండియా, ఆసీస్ మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరమైనట్టే. 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ రూల్ అమల్లో ఉన్న నేపథ్యంలో చివరి రెండు మ్యాచ్‌లకు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండాలంటే వీలైనంత త్వరగా ఆసీస్ వెళ్లాలి. డిసెంబర్ 11న ఫిట్‌నెస్ పరీక్ష ముగించుకున్న వెంటనే బయలుదేరితే 26వ తేదీకి క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో కలుస్తాడు. అయితే, ఐసోలేషన్ టైమ్‌లో రోహిత్‌కు ట్రెయినింగ్ అవకాశం కల్పించాలని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరినట్టు సమాచారం. కాగా, టీ20 సిరీస్‌కు ఎంపికైన యువ పేసర్ టి. నటరాజన్‌ను ఇండియా వన్డే టీమ్‌లో చేర్చినట్టు బోర్డు ప్రకటించింది. మరో ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తనకు బ్యాక్ పెయిన్ వస్తోందని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడంతో అతనికి బ్యాకప్‌గా నటరాజన్‌ను తీసుకున్నామని వెల్లడించింది.
For More News..