T20 World Cup 2024: అప్పుడు బాధ.. ఇప్పుడు భావోద్వేగం: కంటతడి పెట్టుకున్న రోహిత్ శర్మ

T20 World Cup 2024: అప్పుడు బాధ.. ఇప్పుడు భావోద్వేగం: కంటతడి పెట్టుకున్న రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా 10 ఏళ్ళ తర్వాత ఫైనల్ కు చేరుకుంది. గురువారం (జూన్ 27) ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికాతో తుది సమరానికి సిద్ధమైంది. 2022 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ ను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిస్తే.. నిన్న జరిగిన సెమీస్ లో ఇంగ్లాండ్ ను భారీ తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఫైనల్ కు వెళ్లిన సంతోషం ఒక వైపు ఉంటే.. ఇంగ్లీష్ జట్టుపై రివెంజ్ ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. 

డ్రెస్సింగ్ రూమ్ ముందు కూర్చోని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన ఎడమ చేతిని అడ్డం పెట్టుకొని ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న రోహిత్ ను కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, జడేజా వచ్చి సముదాయించారు. చివరిసారిగా జరిగిన 2022 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు రోహిత్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పై రివెంజ్.. భారత్ వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఒకేసారి జరగడంతో రోహిత్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. 

Also Read:ఫైనల్లో కోహ్లీనే టీమిండియాను ఆదుకుంటాడు: రోహిత్ శర్మ

ఈ టోర్నీలో కెప్టెన్ గా, బ్యాటర్ గా రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. 248 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కీలకమైన సూపర్ 8లో ఆస్ట్రేలియాపై 92 పరుగులు.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై 57 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై మరో 34 పరుగులు చేస్తే ఈ టోర్నీ టాప్ స్కోరర్ అవుతాడు. కెప్టెన్ గాను సత్తా చాటుతున్న హిట్ మ్యాన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జట్టును ఫైనల్ కు చేర్చాడు. రోహిత్ ఇదే జోరును ఫైనల్లో కొనసాగిస్తే 17 ఏళ్ళ తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ను భారత్  68 పరుగుల తేడాతో చిత్తు చేసి మూడో సారి ఫైనల్లో అడుగు పెట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో  171/7 స్కోరు చేసింది. 3 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)