IND vs BAN 2nd Test: ఛాలెంజ్‌కు రెడీ.. 100 పరుగులకు ఆలౌటైనా పర్లేదు: రోహిత్ శర్మ

IND vs BAN 2nd Test: ఛాలెంజ్‌కు రెడీ.. 100 పరుగులకు ఆలౌటైనా పర్లేదు: రోహిత్ శర్మ

కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ పై టీమిండియా ఊహించని విజయాన్ని అందుకుంది. దూకుడుగా ఆడుతూ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మూడు వర్షం పడి కేవలం 35 ఓవర్ల మాత్రమే జరగడంతో భారత్ విజయంపై ఎవరికీ ఆశలు లేవు. అయితే నాలుగో రోజు నుంచి ప్రారంభమైన ఆటలో భారత్ జూలు విదిల్చింది. మొదట బౌలింగ్ లో బంగ్లాను త్వరగా ఆలౌట్ చేసి.. ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగి ఆడింది. టీ20 తరహాలో ఆడుతూ  తొలి ఇన్నింగ్స్ లో 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

ఇన్నింగ్స్ రన్ రేట్ 8కి పైగా ఉండడం విశేషం. మ్యాచ్ గెలుపు కోసం ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి విధ్వంసకర ఆట తీరుతో బంగ్లా బౌలర్లను చితక్కొట్టారు. వచ్చిన వారు వచ్చినట్టు చెలరేగి టీ20 గేమ్ ఆడారు. ఆ తర్వాత బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించిన భారత్ 146 పరుగులకే ఆలౌట్ చేసి 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17 ఓవర్లలో ఛేజ్ చేసి విజయాన్ని అందుకున్నారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన ఈ సాహసోపేతమైన పనిపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ జట్టు విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ALSO READ | IND vs BAN 2nd Test: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?

"నాలుగో రోజు ఆట ప్రారంభమైనప్పుడు వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేయాలనుకున్నాం. బౌలర్లను అద్భుతంగా రాణించారు. బంగ్లా 230 పరుగులకే పరిమితం కావడంతో వేగంగా ఆడాలని నిర్ణయిచుకున్నాం. ఈ క్రమంలో మేము రిస్క్ చేయాలనుకున్నాం. ఫలితం కోసం వేగంగా ఆడే క్రమంలో 100, 150 పరుగులకు ఆలౌట్ అయినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. సవాళ్ళను ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం". అని రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌటైంది. మమినుల్ హక్(107*) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు.  194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా, బుమ్రా విజృంభించడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేజ్ చేసింది.