
దుబాయ్: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ చాలా పరిణతి చెందాడని మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. ఇండియాకు ఇది మంచి శుభసూచకమని, జట్టును నడిపించేందుకు ఈ అనుభవం సరిపోతుందన్నాడు.
‘2013 నుంచి 2025 వరకు.. 12 ఏళ్ల అనుభవం రోహిత్‌కు ఉంది. అతను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఒత్తిడిని ఎలా జయించాలో, ప్లేయర్లను ఎలా ముందుకు నడిపించాలో బాగా తెలుసు. కెప్టెన్‌గా చాలా పరిణతి సాధించాడు. ఎప్పుడు ఉదారంగా ఉండాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో హిట్‌మ్యాన్‌కు మంచి అవగాహన ఉంది. జట్టులో బ్యాలెన్స్‌తో పాటు ప్లేయర్లతోనూ మంచి సానిహిత్యం ఉంది..’ అని ధవన్ పేర్కొన్నాడు.
రోహిత్‌తో తొమ్మిదేళ్ల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌ను ఈ సందర్భంగా ధవన్ గుర్తు చేసుకున్నాడు. తనతో పాటు రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలనేది ధోనీ ఆలోచన అని వెల్లడించాడు. ‘మేం ఇద్దరం ఓపెనింగ్ చేయాలని మ్యాచ్‌కు ముందు హాఫ్ డేలో తీసుకున్న నిర్ణయం. ఆ టైమ్‌లో నేను కూడా కొత్తే. నా వరకు బాగా ఆడాలని అనుకున్నా. కానీ రోహిత్‌ను కూడా ఓపెనర్‌గా వెళ్లమని ధోనీ ఆదేశించాడు. అప్పట్లో దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. రోహిత్ కూడా కుదురుకుంటే ఇద్దరం ఆటను ఆస్వాదించొచ్చని భావించా. తొలి మ్యాచ్‌లోనే మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. వికెట్ కోల్పోకుండా వంద కొట్టేశాం. పదేళ్ల పాటు కలిసి ఓపెనింగ్ చేస్తామని అసలు ఊహించలేదు’ అని ఈ ఢిల్లీ బ్యాటర్ వివరించాడు.