T20 World Cup 2024: రోహిత్ శర్మకు గాయం.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అనుమానమే

T20 World Cup 2024: రోహిత్ శర్మకు గాయం.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అనుమానమే

న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) భారత్, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం (జూన్ 7) కాంటియాగ్ పార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. నెట్స్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్‌ను విసిరిన బంతులను ఎదుర్కొనేప్పుడు హిట్ మ్యాన్ బొటనవేలికి తగిలింది. బంతి గ్లోవ్స్‌కు తగలడంతో రోహిత్‌కు వెంటనే ఫిజియోథెరపిస్ట్ చికిత్స అందించాడు. 

బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయంతో రిటైర్‌మెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ప్రాక్టీస్ సెషన్ లో గాయం కావడం ఆందోళన కలిగిస్తుంది. గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం రోహిత్ శర్మ రేపు పాక్ తో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి దాదాపు ఐదు మైళ్ల దూరంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. 

రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ ట్రాక్ పై బౌన్స్‌తో ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాక్టీస్ పిచ్‌లో బంతి ఓవర్ బౌన్స్ అవుతుందని ICCకి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.