ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదంట ఓడిన హార్దిక్ సేన.. అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. గణిత శాస్త్ర పరంగా వారికింకా అవకాశాలు ఉన్నా.. ప్లే ఆఫ్స్ చేరడం అనేది అసంభవమే. ఇలాంటి సమయంలో వారికి మరో చిక్కొచ్చి పడింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన చివరి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేయడానికి మాత్రమే వచ్చాడు. మొదట అతన్ని కావాలనే పక్కన పెట్టారని వార్తలొచ్చినప్పటికీ.. మ్యాచ్ అనంతరం పీయూష్ చావ్లా ముంబై మాజీ కెప్టెన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అతను 'ఫిట్ అండ్ ఫైన్'గా ఉన్నప్పటికీ.. రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇవ్వనుందని సమాచారం.
𝑌𝑎𝑎𝑟𝑜𝑛 𝑘𝑖 𝑦𝑎𝑎𝑟𝑖𝑦𝑎𝑛 💙🧡#MumbaiMeriJaan #MumbaiIndians #MIvSRH pic.twitter.com/8dzBun6x9p
— Mumbai Indians (@mipaltan) May 6, 2024
ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే ఇషాన్ కిషన్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ చేయనున్నాడు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్ మిడిలార్డర్‌లో ఆడనుండగా.. గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, నువాన్ తుషారా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ముంబై తుది జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నమన్ ధిర్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా.