రిటైర్మెంట్ ఆలోచన లేదు.. ఇంకా రెండు లక్ష్యాలున్నాయి: రోహిత్ శర్మ

రిటైర్మెంట్ ఆలోచన లేదు.. ఇంకా రెండు లక్ష్యాలున్నాయి: రోహిత్ శర్మ

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతాడని వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం 36 ఏళ్ళ రోహిత్ శర్మ ఒకటి లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడలేడని.. అతని ఫిట్ నెస్ కూడా ఇందుకు మరో కారణమని అనుకున్నారు. అయితే తాజాగా హిట్ మ్యాన్ తన తన రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న వార్తలను ఖండించాడు.  వీటితో పాటు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. భవిష్యత్తు లక్ష్యాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.       

"నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించట్లేదు. జీవితం నన్ను ఎక్కడివరకు తీసుకెళుతుందో నాకు తెలియదు. ప్రస్తుతం నేను చాలా బాగా ఆడుతున్నాను. కాబట్టి నేను మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ కొనసాగాలనే ఆలోచనలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి వన్డే వరల్డ్ కప్ చూస్తూ పెరిగాను. నా దృష్టిలో వరల్డ్ కప్ అంటే 50 ఓవర్ల ఫార్మాట్ లో జరిగే వన్డే వరల్డ్ కప్. 2025 టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ గెలవాలని ఉంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మేము చెత్తగా ఏమీ ఆడలేదు. ప్రతి ఒక్కరికి ఒక చెడ్డ రోజు వస్తుంది. మాకు కూడా ఆ రోజు అలాంటిదే". అని రోహిత్ తన షో బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్‌లో ప్రముఖ యాంకర్, హోస్ట్ గౌరవ్ కపూర్‌తో అన్నారు.

భారత్ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ రెండు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ రెండు ఓటములు భారత క్రికెటర్లతో పాటు టీమిండియా అభిమానులను కలచి వేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడుతున్నాడు. దీని తర్వాత జూన్ 1న వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఆడనుంది. 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది. 2027 వరల్డ్ కప్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి సంయుక్తంగా ఆతిధ్యమివ్వనున్నాయి. మరి టీమిండియా వీటిలో ఎన్ని టైటిల్స్ గెలుస్తుందో చూడాలి.