T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్‌టైం రికార్డ్స్‌పై కన్నేసిన రోహిత్ శర్మ

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్‌టైం రికార్డ్స్‌పై కన్నేసిన రోహిత్ శర్మ

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.ఈ మెగా టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే జట్టు న్యూయార్క్ చేరుకుంది. రోహిత్ శర్మతో కూడిన భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. 2007లో ధోనీ కెప్టెన్సీలో  టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. ఇప్పటివరకు వరల్డ్ కప్ ను ముద్దాడలేదు. ఈ క్రమంలో 2014 లో ఫైనల్ కు చేరినా నిరాశ తప్పలేదు. వ్యక్తిగతంగా వస్తే ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు ఆల్ టైం రికార్డ్స్ ఊరిస్తున్నాయి. 

కోహ్లీ రికార్డ్ పై కన్ను:

టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 963 పరుగులు సాధించాడు. ఈ లిస్టులో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 1141 పరుగులతో టాప్ లో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజం జయవర్ధనే(1016), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(965) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. మరో మూడు పరుగులు చేస్తే హిట్ మ్యాన్ మూడో స్థానానికి చేరుకుంటాడు. కోహ్లీ కంటే టీ20 వరల్డ్ కప్ లో 179 పరుగులు చేస్తే రోహిత్ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 

గేల్ రికార్డ్ కష్టమే:

టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ విండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ విండీస్ వీరుడు ఇప్పటివరకు పొట్టి ప్రపంచ కప్ లో 63 సిక్సులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 35 సిక్సులతో రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ వరల్డ్ కప్ లో గేల్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మరో 29 సిక్సులు బాదాలి. ఈ మెగా లీగ్ లో మొత్తం 4-9 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీంతో ఈ రికార్డ్ రోహిత్ బ్రేక్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది. 33 సిక్సులతో బట్లర్ మూడో స్థానంలో ఉన్నాడు. 

టీమిండియా మ్యాచ్ ల విషయానికి వస్తే భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌‌తో తలపడనుంది. 12న అమెరికాతో, 15న కెనాడతో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. ప్రాక్టీస్‌లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్ జరగనుంది.