Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్‌కు గాయం, గిల్‌కు అనారోగ్యం

Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్‌కు గాయం, గిల్‌కు అనారోగ్యం

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ కు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ప్రాక్టీస్ సెషన్ లో కూడా హిట్ మ్యాన్ కనిపించలేదట. ఆదివారం(ఫిబ్రవరి 23) దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ నుంచి కాసేపు వెళ్ళిపోయాడు. రోహిత్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తమ చివరి మ్యాచ్ ఆదివారం (మార్చి 2) ఆడనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ కు రెస్ట్ ఇచ్చి రాహుల్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ గాయంతో పాటు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శుభమాన్ గిల్ అనారోగ్యంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గిల్ బుధవారం (ఫిబ్రవరి 26) జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరు కాలేదు. రోహిత్, గిల్ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది. రిస్క్ చేయకుండా రోహిత్, గిల్ లకు కివీస్ తో జరిగే మ్యాచ్ కు రెస్ట్ ఇచ్చి బెంచ్ ను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు.   

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జ్వరం నుండి కోలుకుని బుధవారం నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలి మూడు ఓవర్లు బౌలింగ్ వేసి మైదానాన్ని వీడిన షమీ నెట్ సెషన్‌లలో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌పై ఉన్న భయాలను తొలగించాడు. ఇప్పటికే భారత్ వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు చేరుకుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో ఆదివారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. గెలిచిన జట్టు గ్రూప్ ఏ టేబుల్ టాపర్ గా సెమీస్ లోకి అడుగుపెడుతుంది.