పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. వీరిద్దరూ ఆదివారం (డిసెంబర్ 1) ఆసీస్ కుర్రాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ లో బరిలోకి దిగారు.
మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్ట్ ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. దీనికి తోడు ఆసీస్ తమ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ సేవలను కోల్పోనుంది. గాయం కారణంగా అతను రెండో టెస్టు ఆడడం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది.
Also Read : జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి
అంతా బాగానే ఉన్నా బ్యాటింగ్ ఆర్డర్ పై భారత్ గందరగోళంగా ఉంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్, గిల్ జట్టులో చేరడంతో పడికల్, జురెల్ బెంచ్ కు పరిమితం కానున్నారు. అయితే వీరు ఏ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారనే విషయంలో జట్టు యాజమాన్యం సతమవుతుంది. తొలి టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రాహుల్, జైశ్వాల్ రెండో టెస్టుకు ఓపెనింగ్ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ వస్తారు. మూడో ప్లేస్ లో కెప్టెన్ రోహిత్ వస్తే గిల్ 6 వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది.
ఓపెనింగ్ స్లాట్ ను త్యాగం చేసిన రోహిత్.. గిల్ కోసం మూడో స్థానం అప్పగిస్తే హిట్ మ్యాన్ ఆరో స్థానంలో దిగడం తప్ప ఎలాంటి ఆప్షన్ లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగిన మ్యాచ్ లో జైశ్వాల్, రాహుల్ ఓపెనింగ్ చేయగా.. ఎప్పటిలాగే గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. రోహిత్ 4 స్థానంలో ఆడాడు. మ్యాచ్ సమయానికి జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.