శ్రీలంక టూర్ లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును గురువారం (జూలై 18) ఎంపిక చేయనున్నారు. వన్డే, టీ20 సిరీస్ కోసం కెప్టెన్ గా ఎవర్ని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ఎవర్ని కెప్టెన్ గా ఎంపిక చేస్తారో చూడాలి. హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు.
వన్డే కెప్టెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ లంక సిరీస్ కు అందుబాటులో ఉండడనే ప్రచారం నిన్నటివరకు సాగింది. అయితే తాజాగా వస్తున్న సమాచార ప్రకారం రోహిత్ శర్మ శ్రీలంకతో జరగబోయే వన్డేలకు అందుబాటులో ఉన్నట్టు నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యాన్ ఈ సిరీస్ ఆడాలనుకుంటున్నాడట. లంక సిరీస్ నుంచి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్.. రోహిత్ ను ఆడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లంక సిరీస్ కు రెస్ట్ తీసుకునే అవకాశముంది.
Also Read :- మెడల్ పట్టుకొచ్చేదెవరు?
ఒకవేళ రోహిత్ శర్మ ఈ సిరీస్ కు అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్ భారత జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్ కు షార్ట్ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా పోటీలోకి వచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్ వరకూ సూర్యను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ, సెలెక్టర్లు భావిస్తున్నారట. పాండ్యా విషయంలో బోర్డు, సెలెక్షన్ కమిటీ మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. అతని ఫిట్‌నెస్ సమస్యలే ఇందుకు కారణం. ఎనిమిదేండ్ల కెరీర్‌లో పాండ్యా చాలాసార్లు గాయాలకు గురయ్యాడు.
ఇండియా శ్రీలంక టీ20, వన్డే షెడ్యూల్:
టీ20 సిరీస్
• 1వ టీ20 – 27 జూలై
• 2వ టీ20 – 28 జూలై
• 3వ టీ20 – 30 జూలై
వన్డే సిరీస్
• 1వ వన్డే – 2 ఆగస్ట్
• 2వ వన్డే – 4 ఆగస్ట్
• 3వ వన్డే – ఆగస్ట్ 7