మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తెరలేవనుంది. శుక్రవారం (నవంబర్ 22) నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అందుకు సమయం దగ్గర పడుతుండగా.. భారత అభిమానులకు గుడ్‌న్యూస్ అందుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనున్నాడు.
రెండో సారి తండ్రి..
ఐదు రోజుల క్రితమే రోహిత్ సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గత శుక్రవారం (నవంబర్ 15) ఈ జంట తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. అది జరిగి సరిగ్గా వారం రోజులు గడవలేదు హిట్‌మ్యాన్ ఫ్లైట్ ఎక్కనున్నారు. రెండు టెస్టులు ముగిశాక రోహిత్ భారత జట్టుతో కలుస్తాడని మొన్నటివరకు ప్రచారం జరగ్గా.. అవన్నీ పుకార్లని తేలిపోయింది. తాను ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం.
అతని నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించిన బోర్డు.. హిట్‌మ్యాన్ ఫ్లైట్ ఎక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నవంబర్ 23న రోహిత్ ముంబైలో విమానం ఎక్కనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. నవంబర్ 24 కల్లా భారత కెప్టెన్ పెర్త్ చేరుకోనున్నాడు. అక్కడ కొన్ని గంటల విశ్రాంతి అనంతరం అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టుకు ఎలా సన్నద్ధం అవ్వాలనే దానిపై కోచింగ్ స్టాఫ్‌తో చర్చించనున్నాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి..
తొలి టెస్టు ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా దేశవాళీ జట్టైన ప్రైమినిస్టర్స్ ఎలెవన్‌తో భారత్ 'ఎ' సన్నాహక మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. రెండు రోజుల పాటు జరిగే ఈ వార్మప్ మ్యాచ్ నవంబర్ 30న ప్రారంభమవుతుంది.