
వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను గాయాలు కలవర పెడుతున్నాయి. దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లు అసౌకర్యంగా కనిపించారు. ఇప్పుడు వారి గురించే ఈ చర్చంతా.
ఇండియా- పాక్ మ్యాచ్ మొదలైన గంటకే స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ అసౌకర్యంగా కనిపించారు. పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తున్న షమీ మొదటి 10 ఓవర్లలో చీలమండ నొప్పిగా అనిపించడంతో మైదానం నుండి వెళ్లిపోయారు. భారత కెప్టెన్ రోహిత్ పరిస్థితి దాదాపు అంతే. తొడ కండరాల సమస్యతో బాధపడ్డాడు. బాబర్ ఆజం ఔట్ అవ్వగానే సహచరులు విస్తృతంగా సంబరాలు చేసుకోగా.. రోహిత్ మాత్రం తొడ కండరాలను పట్టుకుని కనిపించాడు. ఆ తరువాత కాసేపు మైదానాన్ని వీడడంతో.. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
ఈ రెండు ఘటనలు భారత అభిమానుల్లో కొత్త ఆందోళన రేకెత్తించాయి. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా..సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇటువంటి సమయంలో వీరు దూరమైతే.. అన్న కొత్త సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఆ సందేహాలను నివృత్తి చేశాడు. అందరూ బాగున్నారని, జట్టులో ఎటువంటి సమస్యలు లేవని అన్నాడు.
రోహిత్, షమీలను ఉద్దేశించి అయ్యర్.. "నేను వారితో కొద్దిసేపు మాట్లాడాను. గాయాల సమస్య ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదు. జట్టులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు తెలిసినంతవరకు జట్టులో ఎవరికీ.. ఎటువంటి సమస్య లేదు.." అని మ్యాచ్ తర్వాత అన్నారు.
2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో చీలమండ గాయం కారణంగా దూరమైన షమీ.. ఈ మధ్యనే తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు, రోహిత్ ఇటీవల కాలంలో గాయపడిన సందర్భాలు లేవు. అన్ని టోర్నీల్లో ఆడుతున్నాడు. కావున ఆందోళన అక్కర్లేదు.