వాళ్లు నా మూడు స్తంభాలు : రోహిత్ శర్మ

వాళ్లు నా మూడు స్తంభాలు : రోహిత్ శర్మ
  • టీ20 వరల్డ్ కప్‌‌ విజయంలో ద్రవిడ్‌‌, జై షా, అగార్కర్‌‌‌‌ పాత్ర కీలకం: రోహిత్‌‌
  • సియెట్‌‌  మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న హిట్‌‌మ్యాన్‌‌

ముంబై : టీ20 వరల్డ్ కప్‌‌ విజయంలో ఆటగాళ్లతో పాటు మాజీ హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌, చీఫ్‌‌ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌‌‌, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా తనకు వెన్నుదన్నుగా నిలిచారని రోహిత్ శర్మ తెలిపాడు. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ పెర్ఫామెన్స్ రాబట్టేలా ఈ ముగ్గురూ తనకు మూడు స్తంభాలుగా సపోర్ట్‌‌ ఇచ్చారని చెప్పాడు.  ‘గణాంకాలు, ఫలితాల గురించి పెద్దగా ఆందోళన చెందకుండా క్రికెటర్లు  మైదానంలోకి వచ్చి  స్వేచ్ఛగా ఆడే  వాతావరణం కల్పించాలన్నది, జట్టును అలా తీర్చిదిద్దాలన్నది నా కల.

కప్పు నెగ్గేందుకు అవసరం అయింది కూడా అదే. ఇందుకు నా మూడు స్తంభాలైన షా, ద్రవిడ్‌‌, అగార్కర్‌‌‌‌ నుంచి నాకెంతో సాయం లభించింది. దాంతో చాలా కష్టమైన ఈ పనిని నేను పూర్తి చేయగలిగాను. మేం సాధించిన విజయంలో క్రికెటర్ల పాత్ర కూడా గొప్పది’ అని బుధవారం ముంబైలో జరిగిన సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌‌ ఫంక్షన్‌లో  మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న రోహిత్ తెలిపాడు. దశాబ్దకాల విరామం తర్వాత వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని హిట్‌‌మ్యాన్ అన్నాడు.

 ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా ముంబైకి  ఐదు ట్రోఫీలు గెలిచినా మరిన్ని అందుకోవాలనే తన తపన తగ్గదని రోహిత్ స్పష్టం చేశాడు. ‘నేను ఐదు ట్రోఫీలు నెగ్గడానికి ఓ కారణం ఉంది. ఒకసారి విజయం రుచి చూసి, మ్యాచ్‌‌లు, ట్రోఫీలు గెలిచిన తర్వాత  మనం ఆగిపోలేము.  జట్టుతో కలిసి ముందుకెళ్తాం. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు అందుకోవాలని చూస్తాం’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ పురస్కారాల్లో  మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌కు లైఫ్ టైమ్‌‌ అచీవ్‌‌మెంట్‌‌ అవార్డు లభించింది.  2023కి గాను కోహ్లీ బెస్ట్ వన్డే బ్యాటర్‌‌‌‌, షమి బెస్ట్ వన్డే బౌలర్‌‌‌‌ అవార్డులు నెగ్గగా, టెస్టు బ్యాటర్‌‌‌‌గా యశస్వి జైస్వాల్‌‌, బౌలర్‌‌‌‌గా అశ్విన్‌‌ నిలిచారు.