డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌పై రోహిత్‌‌‌‌ దృష్టి..ఫామ్‌‌‌‌లోకి వచ్చేందుకు ముమ్మర ప్రాక్టీస్‌‌‌‌

డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌పై రోహిత్‌‌‌‌ దృష్టి..ఫామ్‌‌‌‌లోకి వచ్చేందుకు ముమ్మర ప్రాక్టీస్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌ ‌‌‌:  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో నుంచి ఆడిన ఏడు టెస్టుల్లో ఒకే ఒక్క ఫిఫ్టీ చేసిన హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ 8 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం అయ్యాడు. ఆస్ట్రేలియాతో పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 3,6.. బ్రిస్బేన్‌‌‌‌లో 10 స్కోర్లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన నాయకుడిగా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్న రోహిత్‌‌‌‌పై విమర్శల దాడి పెరిగింది. ఈ నేపథ్యంలో తను తక్షణమే గాడిలో పడాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ నెల 26 నుంచి మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో జరిగే బాక్సింగ్‌‌‌‌ డే టెస్టులో అయినా  సత్తా చాటాలని ఆశిస్తున్న కెప్టెన్‌‌‌‌.. అందుకోసం తన బలహీనతలు సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాడు.  నాలుగో టెస్టు కోసం టీమిండియా ఎంసీజీలో శనివారం ప్రాక్టీస్ ప్రారంభించగా..  అందరి ఫోకస్‌‌‌‌  మాత్రం రోహిత్‌‌‌‌పైనే నిలిచింది.   తన సుదీర్ఘ నెట్ సెషన్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ ముందుగా స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా అతనికి బౌలింగ్‌‌‌‌ చేశారు. గ్రౌండ్‌‌‌‌లో ఫీల్డర్లు ఉన్నట్టుగా ఊహించుకుంటూ అతను షాట్లు కొట్టాడు. డిఫెన్స్‌‌‌‌ను మెరుగు పరుచుకోవడంపై రోహిత్ ఎక్కువగా దృష్టి పెట్టాడు.  

తన ప్రాక్టీస్ కొనసాగిస్తూనే పక్క నెట్స్‌‌‌‌లో యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ను కెప్టెన్ పరిశీలించారు. సెషన్ మధ్యలో జైస్వాల్‌‌‌‌కు త్రో డౌన్స్ వేయాలని సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు సూచించాడు. అయితే, ఓ త్రౌ డౌన్‌‌‌‌ బాల్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌కు తగిలింది. దాంతో  మొదట్లో కొంచెం నెమ్మదిగా బాల్స్ వేయాలంటూ త్రో డౌన్ స్పెషలిస్ట్‌‌‌‌కు చెప్పాడు. తర్వాత మళ్లీ నెట్స్‌‌‌‌లోకి వెళ్లి చెమటలు చిందించాడు. తన నెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత రోహిత్ మిగతా ప్లేయర్ల సాధనను పరిశీలించాడు. కాసేపటికే అసిస్టెంట్ కోచ్‌‌‌‌ అభిషేక్ నాయర్‌‌‌‌‌‌‌‌ అతని వద్దకు వచ్చాడు.

ఇద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు.  సిరీస్‌‌‌‌లో తను ఔట్‌‌‌‌ అవుతున్న తీరుపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్‌‌‌‌ షాడో ఫార్వర్డ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌, ఔట్‌‌‌‌ సైడ్ ఆఫ్‌‌‌‌ పంచ్‌‌‌‌ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో రోహిత్ తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకునేందుకు నాయర్‌‌‌‌‌‌‌‌ సలహాలు ఇస్తున్నట్టు అర్థం అయింది. ఇంకోవైపు గత రెండు మ్యాచ్‌‌ల్లో ఫెయిలైన విరాట్ కోహ్లీతో పాటు బౌలర్లు బుమ్రా, సిరాజ్‌‌, ఆకాశ్‌‌, హర్షిత్‌‌ రాణా కూడా నెట్స్‌‌లో చెమటోడ్చారు.

రాహుల్‌‌ చేతికి గాయం!

ఈ సిరీస్‌‌లో ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా ఉన్న కేఎల్ రాహుల్‌‌ ప్రాక్టీస్‌‌లో గాయపడ్డాడు. నెట్స్‌‌ లో బ్యాటింగ్‌‌ చేస్తుండగా ఓ బాల్ అతని కూడి చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడ్డ రాహుల్‌‌..  వెంటనే ఫిజియోతో చికిత్స చేయించుకున్నాడు. అయితే, తన గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంటుంది.