SL vs IND, 2nd ODI: ఓడినా ఇలాగే ఆడతా.. షాట్ సెలక్షన్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు

SL vs IND, 2nd ODI: ఓడినా ఇలాగే ఆడతా.. షాట్ సెలక్షన్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో తనదైన శైలిలో పవర్ ప్లే లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో సూపర్ స్టార్ట్ ఇచ్చిన హిట్ మ్యాన్.. 8 ఏళ్ళ తర్వాత వన్డే ఆడుతున్న అదే ఫామ్ తో అదరగొడుతున్నాడు. పవర్ ప్లే లోనే టీమిండియా విజయానికి బాటలు వేస్తున్నాడు. అయితే  జట్టుకు మెరుపు ఆరంభం అందించినా మ్యాచ్ గెలిపించలేకపోతున్నాడు.

తొలి వన్దేలో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. రెండు వన్డేలోనూ అదే దూకుడు కనబరిచాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 5 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. రెండు మ్యాచ్ ల్లోనూ రోహిత్ శర్మ ఔట్ కావడంతో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ గొప్పగా బ్యాటింగ్ చేసినా ఒక అనవసర షాక్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. వండరాసే బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి నిశాంకకు క్యాచ్ ఇచ్చాడు. మ్యాచ్ ఓటమి తర్వాత రోహిత్ షాట్ సెలక్షన్ గురించి అడిగితే.. హిట్ మ్యాన్ తన ఉద్దేశ్యం గురించి స్పష్టంగా చెప్పాడు.

“నేను బ్యాటింగ్ చేసిన విధానమే 65 పరుగులు చేయడానికి కారణమైంది. నేను అలా బ్యాటింగ్ చేసినప్పుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి నేను ఏ మాత్రం భయపడను. మీరు 100, 50 చేసి నిష్క్రమించినా జట్టు గెలవకపోతే మీరు నిరుత్సాహ పడతారు. ఓడిపోయినా నేను నా ఉద్దేశ్యాన్ని మార్చుకోను. ఎప్పటిలాగే దూకుడుగానే ఆడతాను. ఈ రోజు మంచి క్రికెట్ ఆడలేదు.అందుకే మ్యాచ్ ఓడిపోయాం' అని రోహిత్ చెప్పాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39) పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 64 పరుగులతో రోహిత్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, తరువాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్‌లో అక్సర్ పటేల్(44) పర్వాలేదనిపించాడు.