T20 World Cup 2024: ఫైనల్లో కోహ్లీనే టీమిండియాను ఆదుకుంటాడు: రోహిత్ శర్మ

T20 World Cup 2024: ఫైనల్లో కోహ్లీనే టీమిండియాను ఆదుకుంటాడు: రోహిత్ శర్మ

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతుంది. టోర్నీ అంతటా దారుణంగా విఫలమైన విరాట్.. గురువారం (జూన్ 27) ఇంగ్లాండ్ పై జరిగిన సెమీ ఫైనల్లోనూ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించినా కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులు చేసి టోప్లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ ఆడకపోయినా.. కీలకమైన సెమీ ఫైనల్లో ఖచ్చితంగా ఆడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం కోహ్లీ ఫామ్ టీమిండియాకు పెద్ద మైనస్ గా మారింది. అయితే ఈ దశలో కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంటర్వ్యూలో కోహ్లీ వైఫల్యం గురించి చర్చించినప్పుడు రోహిత్ సానుకూలంగా స్పందించాడు. కోహ్లీని వెనకేసుకొచ్చి అతనికి మద్దతుగా నిలిచాడు. "కోహ్లీ నాణ్యమైన ఆటగాడు. పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు అతను మాకు కీలక ప్లేయర్. అతని ఫామ్ మాకు ఎప్పుడూ సమస్య కాదు. 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడు గాడిలో పడడానికి ఒక్క మ్యాచ్ చాలు. అతడు ఫైనల్లో టీమిండియాను ఆదుకుంటాడు". అని మ్యాచ్ అనంతరం మైఖేల్ అథర్టన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

Also Read:అప్పుడు బాధ.. ఇప్పుడు భావోద్వేగం: కంటతడి పెట్టుకున్న రోహిత్ శర్మ

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోహ్లీ విషయానికి వస్తే ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్ ల్లో 10 యావరేజ్ తో 75 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్ పై చేసిన 37 పరుగులు అత్యధిక స్కోర్. ఒక ఐసీసీ టోర్నీలో కోహ్లీ ఇలా విఫలం కావడం ఇదే తొలిసారి. ఏడు ఇన్నింగ్స్ ల్లో 5 సార్లు సింగిల్ డిజిట్ కే కింగ్ పరిమితమయ్యాడు. శనివారం (జూన్ 29) రాత్రి 8 గంటలకు దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లోనైనా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది.