T20 World Cup 2024 Final: రోహిత్ అన్నదే జరిగింది.. ఫైనల్లో భారత్‌ను ఆదుకున్న కోహ్లీ

T20 World Cup 2024 Final: రోహిత్ అన్నదే జరిగింది.. ఫైనల్లో భారత్‌ను ఆదుకున్న కోహ్లీ

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగిన సంగతి తెలిసిందే.    టోర్నీ అంతటా దారుణంగా విఫలమైన విరాట్.. గురువారం (జూన్ 27) ఇంగ్లాండ్ పై జరిగిన సెమీ ఫైనల్లోనూ నిరాశ పరిచాడు. 9 బంతుల్లో 9 పరుగులు చేసి టోప్లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ ఆడకపోయినా.. కీలకమైన సెమీ ఫైనల్లో ఖచ్చితంగా ఆడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఫైనల్ సమరంలోనూ కోహ్లీ ఫామ్ టీమిండియాకు పెద్ద మైనస్ గా మారింది. అయితే ఈ దశలో కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంటర్వ్యూలో కోహ్లీ వైఫల్యం గురించి చర్చించినప్పుడు రోహిత్ సానుకూలంగా స్పందించాడు. కోహ్లీని వెనకేసుకొచ్చి అతనికి మద్దతుగా నిలిచాడు. "కోహ్లీ నాణ్యమైన ఆటగాడు. పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు అతను మాకు కీలక ప్లేయర్. అతని ఫామ్ మాకు ఎప్పుడూ సమస్య కాదు. 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడు గాడిలో పడడానికి ఒక్క మ్యాచ్ చాలు. అతడు ఫైనల్లో టీమిండియాను ఆదుకుంటాడు". అని మ్యాచ్ అనంతరం మైఖేల్ అథర్టన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ చెప్పినట్టుగానే కోహ్లీ ఫైనల్లో భారత్ ను ఆదుకున్నాడు. టోర్నీ మొత్తం  విఫలమైన కోహ్లీ ఫైనల్లో సత్తా చాటాడు. 59 బంతుల్లో76 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. ఒకదశలో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, శివమ్ దూబేలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ లో హాఫ్ సెంచరీ చేయడం కోహ్లీకి ఇది వరుసగా ఇది నాలుగోసారి. 2014, 2016, 2022, 2024 టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు.