SL vs IND, 2nd ODI: వారెవ్వా హిట్ మ్యాన్.. ఒకే మ్యాచ్‌లో సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన రోహిత్

SL vs IND, 2nd ODI: వారెవ్వా హిట్ మ్యాన్.. ఒకే మ్యాచ్‌లో సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన రోహిత్

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియాకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం దక్కపోయినా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆదివారం (ఆగస్ట్ 4) కొలంబో వేదికగా శ్రీలంకపై జరిగిన రెండో వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్.. మొత్తం 44 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో టీమిండియా మాస్టర్ బ్లాస్టర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 120 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 2007లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రోహిత్.. ఓపెనర్‌గా 121 యాభై-ప్లస్ స్కోర్లు చేశాడు. ఓపెనర్లుగా అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు.ఈ ఆసీస్ స్టార్ ఖాతాలో 146 యాభై-ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (144).. శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (136).. వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ (131).. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (125) ఉన్నారు.

ఇదే క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ రికార్డ్ ను రోహిత్ శర్మ బ్రేక్ చేయడం విశేషం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో రోహిత్ ద్రవిడ్ ను అధిగమించాడు. వన్డేల్లో ద్రవిడ్ 10,768 పరుగుల రికార్డ్ ను రోహిత్ దాటి ప్రస్తుతం 10831 పరుగులతో నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో భారత్ తరపున రోహిత్ నాలుగో స్థానంలో ఉంటే.. ఓవరాల్ గా 10వ స్థానంలో నిలిచాడు.