కోహ్లీని దాటేసిన రోహిత్.. టీమిండియా నెంబర్ వన్ బ్యాటర్‌గా హిట్ మ్యాన్

కోహ్లీని దాటేసిన రోహిత్.. టీమిండియా నెంబర్ వన్ బ్యాటర్‌గా హిట్ మ్యాన్

టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్టుల్లో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ లో విఫలమైన హిట్ మ్యాన్..తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో నిరాశపరుస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్నా..  రోహిత్ శర్మ మాత్రం టీమిండియా టాప్ బ్యాటర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 13, రెండో ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కోహ్లీని అధిగమించాడు. ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు 29 మ్యాచ్ ల్లో 48 యావరేజ్ తో 2242 పరుగులు చేశాడు. వీటిలో 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు కోహ్లీ 36 టెస్టుల్లో 39 యావరేజ్ తో 2235 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ తొలి రెండు టెస్టులు ఆడకపోవడంతో రోహిత్ విఫలమైనా.. టాప్ లో ఉన్నాడు. మూడు, నాలుగు టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపించకపోవడంతో రోహిత్ మరింత ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.   

సీనియర్ ప్లేయర్లు చటేశ్వర్ పుజారా(1769), అజింక్య రహానే (1589) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. యాక్సిడెంట్ కారణంగా సంవత్సరం పాటు టెస్ట్ క్రికెట్ కు దూరంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 1575 పరుగులతో ఐదో స్థానంలో ఉండటం విశేషం. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 4039 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మార్నస్ లబుషేన్(3805), స్టీవ్ స్మిత్ (3435) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.