Ranji Trophy: రంజీ ట్రోఫీ జట్టుతో రోహిత్ శర్మ.. ప్రాక్టీస్‌లో తీవ్ర కసరత్తులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫి ఆడేందుకు సిద్ధమయ్యాడు. పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతున్న హిట్ మ్యాన్ భారత జట్టుకు భారంగా మారుతున్నాడు. కెప్టెన్ గా, బ్యాటర్ విఫలమవుతూ టెస్ట్ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్నాడు. దీంతో ఫామ్ కోసం దేశవాళీ క్రికెట్ బాట పట్టాడు. మంగళవారం(జనవరి 14) వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించాడు. వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేతో కలిసి రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.

ఏడాది కాలంగా రోహిత్ టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు.. కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ ప్రదర్శన బీసీసీఐకి అసలు నచ్చలేదు. మూడు టెస్టుల్లో 10.93 యావరేజ్ తో వరుసగా 3,9,10,3,6 పరుగులు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌కు కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ చివరిసారిగా ముంబై జట్టుతో 2015లో ఉత్తరప్రదేశ్‌పై రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ తో పాటు గిల్ రంజీ ట్రోఫీ ఆడే ఆడుతున్నట్టు సమాచారం. 
 
పేలవ ఫామ్ కారణంగా రోహిత్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో బుమ్రాకు పూర్తిస్థాయిలో టెస్ట్ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జూన్ నెలలో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ భారత టెస్ట్ ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను ప్రకటించనుందని సమాచారం. ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన రోహిత్.. టెస్టుల నుంచి తప్పుకున్న ఆశ్చర్యం లేదు.