Rohit Sharma: అలాంటి ఆలోచన లేదు.. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ వేదికగా భారత్ టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హిట్ మ్యాన్ తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని తెలిపిన రోహిత్.. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో రోహిత్ వన్డే, టెస్ట్ కెరీర్ త్వరలో ముగిసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి. 

ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు కావడంతో త్వరలోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్ కు టీమిండియా కెప్టెన్ చెక్ పెట్టాడు. తాను క్రికెట్ లో మరికొంత కాలం కొనసాగుతానని స్పష్టం చేశాడు. "రిటైర్మెంట్ గురించి ఎలాంటి ఆలోచన లేదు. నన్ను కొంతకాలం మీరు క్రికెట్ లో చూస్తారు. వర్తమానంపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తు పై ఎలాంటి ఆలోచన లేదు". అని రోహిత్ శర్మ అన్నారు.
 
టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ కు దూరమయ్యాడు. జూలై 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే బంగ్లాదేశ్ పై జరిగే టెస్ట్ సిరీస్ కు హిట్ మ్యాన్ అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం రోహిత్ లండన్ లో ఉన్నారు. అక్కడ జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్  మ్యాచ్ లను చూస్తూ తళుక్కున మెరిశాడు.