భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ20లో డబుల్ సూపర్ ఓవర్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎన్నో నాటకీయ మలుపులు చేసుకున్నాయి. మ్యాచ్ టై కావడంతో పాటు.. సూపర్ ఓవర్ కూడా టై గా ముగిసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో రెండు సూపర్ ఓవర్ లు జరిగిన తొలి మ్యాచ్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మొదటి సూపర్ ఓవర్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చివరి బంతికి అవుట్ కాకుండానే డగౌట్ కు వెళ్ళిపోయాడు. అయితే ఇలా చేయడం సరైనదేనా..? క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
సూపర్ ఓవర్లలో బ్యాటింగ్ గురించి MCC రూల్స్ ఎలా ఉన్నాయి
25.4.2 – అనారోగ్యం, గాయం లేదా మరేదైనా అనివార్య కారణాల వల్ల ఒక బ్యాటర్ రిటైర్ అయితే.. ఆ బ్యాటర్ ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించడానికి అర్హత కలిగి ఉంటాడు. దీనిని 'రిటైర్డ్ - నాటౌట్'గా ప్రకటించాలి.
25.4.3 – ఒక బ్యాటర్ అనారోగ్యం, గాయం లేదా మరేదైనా అనివార్య కారణాల వలన కాకుండా మరేదైనా కారణంతో రిటైర్ అయితే.. ప్రత్యర్థి కెప్టెన్ అనుమతితో మాత్రమే ఆ బ్యాటర్ ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించవచ్చు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎలాంటి కారణం లేకుండానే డగౌట్ కి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రత్యర్థి కెప్టెన్ అనుమతితోనే మళ్ళీ ఇన్నింగ్స్ ప్రారంభించాలి. కానీ హిట్ మ్యాన్ వెళ్ళింది చివరి బంతికి కాబట్టి ఇన్నింగ్స్ తిరిగి ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది.
సూపర్ ఓవర్లలో బ్యాటింగ్ గురించి ఐసీసీ నిబంధనలు:
టై సూపర్ ఓవర్ విషయంలో ICC రూల్స్ ప్రకారం.. ఏదైనా మునుపటి సూపర్ ఓవర్‌లో అవుట్ అయిన బ్యాట్స్‌మన్ తదుపరి సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అనర్హులు. రోహిత్ రిటైర్డ్ అయ్యాడా లేదా రిటైర్డ్ హర్ట్ అయ్యాడా అనే విషయంపై మ్యాచ్ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రోహిత్ రెండో సూపర్ ఓవర్ లో కూడా బ్యాటింగ్ కు తిరిగి వచ్చాడు కాబట్టి రిటైర్ అయినట్టుగానే క్రికెట్ లవర్స్ అర్ధం చేసుకుంటున్నారు.
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ (69 బాల్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) సెంచరీకి తోడు రింకూ సింగ్ (39 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 69 నాటౌట్) ఫిఫ్టీతో దంచడంతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 212/4 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో గుల్బదిన్ నైబ్ (55 నాటౌట్), రహ్మనుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (50) మెరుపులతో అఫ్గానిస్తాన్ సైతం 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 స్కోరు చేసింది. దాంతో విన్నర్‌ను తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను ఆశ్రయించారు.
తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 రన్స్ చేయగా.. ఇండియా కూడా 16 రన్స్ చేసింది. రెండో సూపర్ లో రోహిత్ 6,4తో సత్తా చాటడంతో ఇండియా 5బాల్స్‌కు 11 రన్స్‌కు రెండు వికెట్లు (ఆలౌట్) కోల్పోయింది. అఫ్గాన్12 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌కు రాగా రోహిత్ అనూహ్యంగా రవి బిష్ణోయ్‌తో బౌలింగ్ చేయించాడు. బిష్ణోయ్ తొలి బాల్‌కు నబీని, మూడో బాల్‌కు రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్ చేసి ఓడింది. ఈ మ్యాచ్ గెలవడంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్,శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.