IPL 2019 final: సూపర్ ఓవర్ అంటే నాకు ఇష్టం లేదు.. అందుకే ఫైనల్లో రిస్క్ చేశాను: రోహిత్ శర్మ

IPL 2019 final: సూపర్ ఓవర్ అంటే నాకు ఇష్టం లేదు.. అందుకే ఫైనల్లో రిస్క్ చేశాను: రోహిత్ శర్మ

2019 ఐపీఎల్ ఫైనల్.. ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్. చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 9 పరుగులు కావాలి. అప్పటివరకు 80 పరుగులు అద్భుతంగా పోరాడిన వాట్సన్ ఔట్.. గెలవాలంటే మరో 2 బంతుల్లో 4 పరుగులు చేయాలి. మలింగా వేసిన ఫుల్ టాస్ కు శార్దూల్ ఠాకూర్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఈ దశలో మలింగా వేసిన స్లో యార్కర్ కు శార్దూల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అంతే.. ముంబై ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు చెన్నై అలాగే షాక్ లో ఉండిపోయింది. 

ఫైనల్ తర్వాత అందరూ మలింగా బౌలింగ్ ను మెచ్చుకున్నారు. ఐపీఎల్ లోనే కాదు ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్లలో మలింగా ఒకడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో మలింగా వేసిన స్లో యార్కర్ రోహిత్ ఇచ్చిన ఐడియా అంట. ఈ విషయాన్ని ఇటీవలే రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. జతిన్ సప్రుతో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ మాటాడుతూ.. "నా స్నేహితుడు (శార్దూల్ ఠాకూర్) నా ముందు ఆడుతున్నాడు. అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడో.. అతని బ్యాట్ ఎలా స్వింగ్ అవుతుందో నాకు తెలుసు.

చివరి బంతిని ఎలా వేయబోతున్నావో అని మలింగాను అడిగాను. అతను "నేను యార్కర్ వేస్తాను, బంతి రివర్స్ అవుతోంది" అని అన్నాడు. అందుకు నేను యార్కర్ మంచి ఆప్షన్. కానీ అతని బ్యాట్ కు ఇన్సైడ్ ఎడ్జ్ వస్తే ఫోర్ వెళ్తుంది. స్లో యార్కర్ వేయడం బెస్ట్ ఆప్షన్ అని..అతను సిక్స్ కొట్టినా పర్వాలేదు అని మలింగతో చెప్పాను. మ్యాచ్ ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే రిస్క్ చేశాను". అని హోస్ట్ జతిన్ సప్రూతో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ అన్నారు. మలింగా స్లో యార్కర్ వేయడంతో శార్దూల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు.