బతికిపోయిన బాబర్: పాక్ కెప్టెన్‌ను కాపాడిన రోహిత్ శర్మ

బతికిపోయిన బాబర్: పాక్ కెప్టెన్‌ను కాపాడిన రోహిత్ శర్మ

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని మేలు చేసాడు. వరల్డ్ కప్ కి ముందు ప్రత్యక్షంగా కాకపోయినా రోహిత్ చేసిన ఒక ప్రయోగం బాబర్ ని కాపాడింది. దీంతో వరల్డ్ కప్ కి ముందు పాక్ కెప్టెన్ టాప్ ర్యాంకర్ గా అడుగుపెట్టబోతున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ   నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించుకున్నా.. ఆ ర్యాంక్ ని సేఫ్ గా ఉంచింది మాత్రం హిట్ మ్యాన్. 

అసలు విషయానికి వస్తే.. వన్డేల్లో బాబర్ అజాం నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాబర్ తర్వాత టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బాబర్ కి 857 రేటింగ్ పాయింట్లు ఉండగా.. గిల్ ఖాతాలో 847 పాయింట్లు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 10 మాత్రమే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అదరగొడుతున్న గిల్.. మూడో వన్డేలో మరో 15 పరుగులు చేసినా వన్డేలో నెంబర్ వన్ కిరీటాన్ని అందుకునేవాడు.
 
కానీ రాజ్ కోట్ వన్డేలో టీం యాజమాన్యం గిల్ కి రెస్ట్ ఇచ్చింది. దీంతో నెంబర్ ర్యాంక్ ని అందుకునే అరుదైన అవకాశం గిల్ కి దక్కకపోగా బాబర్ తన టాప్ ర్యాంకుని కాపాడుకున్నాడు. ఒకవేళ రోహిత్ ఈ మ్యాచులో గిల్ ని ఆడించి ఉంటే ఫామ్ లో ఉన్న గిల్ కి 15 పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. మొత్తానికి గిల్ కి రెస్ట్ ఇవ్వడం బాబర్ కి కలిసి వచ్చింది. మరి వరల్డ్ కప్ లో వీరిద్దరి మధ్య జరిగే నెంబర్ వన్ సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.