Rohit Sharma: చేసింది 30 పరుగులు.. అప్పుడే అలుపు: రంజీ పోరుకు రోహిత్ దూరం

Rohit Sharma: చేసింది 30 పరుగులు.. అప్పుడే అలుపు: రంజీ పోరుకు రోహిత్ దూరం

'రోహిత్ రంజీల్లో ఆడనున్నాడు.. ఇక పరుగుల ప్రవాహమే', 'ఫామ్ అందుకోవడం రోహిత్‌కు కష్టమేమీ కాదు, సెంచరీల మీద సెంచరీలు చేస్తాడు.. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి రాటుదేలుతాడు..' ఇవి వారం రోజుల క్రితం భారత కెప్టెన్ గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు. తీరా చూస్తే.. అదంతా తూచ్ అన్నట్లు అయ్యింది. హిట్‌మ్యాన్ ఒక్క మ్యాచ్‌ ఆడాడో లేదో.. అప్పుడే అలసిపోయాడట. 

రంజీలో భాగంగా ముంబై జట్టు తదుపరి మేఘాలయతో తలపడాల్సి ఉంది. జనవరి 30న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2న ముగియనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉండనున్నాడు. అందుకు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ను సాకుగా చూపుతున్నారు. ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జట్టు ఆటగాళ్లందరూ రెండు.. మూడు రోజులు ముందు సమావేశం కావాల్సి ఉంది. అందువల్లే హిట్‌మ్యాన్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. 

ALSO READ | Suresh Raina: ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అతనిదే: సురేష్ రైనా

అదే నిజమనుకున్నవన్డే సిరీస్ ప్రారంభం కావడానికి రెండ్రోజులు ముందంటే.. ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీలు అనుకోవచ్చు. కానీ, మ్యాచ్ ఫిబ్రవరి 2 నాటికే ముగుస్తుంది. ఈ లెక్కన రోహిత్ బరిలోకి దిగొచ్చు. కానీ, ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తదుపరి మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో అయితే రోహిత్ పేరు లేదు.

J &K చేతిలో ఓటమి.. 

అందునా, జమ్మూ& కాశ్మీర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శివం దూబే వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నా.. ముంబైని ఓటమి నుండి బయట పడేయలేకపోయారు. ఈమ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 31 పరుగులు(3,28) చేశాడు.

తదుపరి మ్యాచ్‌కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సిద్ధేష్ లాడ్, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుష్ కోటియన్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ రాయిస్టన్, శ్రేయాస్ గురవ్, అధర్వ అంకోలేకర్.