Rohit Sharma: పదేళ్ల తరువాత రంజీల్లోకి.. ముంబై జట్టులో రోహిత్ పేరు

Rohit Sharma: పదేళ్ల తరువాత రంజీల్లోకి.. ముంబై జట్టులో రోహిత్ పేరు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల తరువాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. 2025, జనవరి 23 నుండి జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ పోరుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సోమవారం(జనవరి 20) తమ జట్టును ప్రకటించింది. అజింక్యా రహానే నేతృత్వంలోని ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు కల్పించారు.

రోహిత్ చివరిసారిగా 2015లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున రెడ్ బాల్ టోర్నమెంట్‌లో ఆడాడు. ఆ తరువాత ఇదే తొలిసారి. భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ అయినటువంటి రోహిత్ ముంబై తరఫున బరిలోకి దిగడం తమకు గర్వకారణమని ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ అన్నారు. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి యువ ఆటగాళ్లలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని కొనియాడారు. రోహిత్ జట్టులో ఉండటం ప్రత్యర్థిపై ప్రభావం తప్పక చూపుతుందని ప్రశంసించారు.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు సిరీస్‌లలో ఘోరంగా విఫలమైన రోహిత్, దేశవాళీ టోర్నీ ద్వారా తిరిగి మునుపటి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. 

మరోవైపు యశస్వి జైస్వాల్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఆ మ్యాచ్‌లో రోహిత్, జైశ్వాల్ ద్వయం ముంబై ఇన్నింగ్స్‌ ప్రారంభించవచ్చు. ఇదే జట్టులో ఇతర భారత అంతర్జాతీయ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే , శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నారు. 

J&Kతో రంజీ మ్యాచ్‌కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్, తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వస్టర్ డిసౌజా, రాయ్ స్టన్ డయాస్, కర్ష్ కొఠారి.