బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓడినప్పటికీ.. భారత వర్ధమాన క్రికెటర్, తెలుగోడు నితీష్ రెడ్డి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తన అద్భుత సెంచరీ(114)తో భారత జట్టుకు ప్రాణం పోశాడు. గెలిచే అవకాశాలు కల్పించాడు. ఈ మ్యాచ్ ఒక్కటే కాదు.. పెర్త్ అరంగేట్ర టెస్ట్ నుంచి అతను అంతకంతకూ మెరుగు పడుతున్నాడు. పరిస్థితులు అర్థం చేసుకొని అందుకు తగ్గట్టు ఆడుతున్నాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐసీసీ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసేందుకు సహాయ పడింది.
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నితీశ్ రెడ్డి.. తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ 528కి చేరుకున్నాడు. ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్(854 పాయింట్లు) ఒక ర్యాంక్ మెరుగు పరుచుకొని నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
ALSO READ | టీమిండియా 9 మందితోనే ఆడుతోంది.. ఈ మాటంటే వారిద్దరి అభిమానులు ఓర్చుకోలేరు: సీవీ ఆనంద్
ఇక ప్రస్తుత ఆసీస్ పర్యటనలో 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 40 స్థానానికి దిగజారగా.. అడపాదడపా రాణిస్తున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మూడు స్థానాలు దిగజారి 24వ స్థానానికి పడిపోయాడు.
ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు
- యశస్వి జైస్వాల్: 4 (854 పాయింట్లు)
- రిషబ్ పంత్: 12 (701 పాయింట్లు)
- శుభమాన్ గిల్: 20 (645 పాయింట్లు)
- విరాట్ కోహ్లీ: 24 (633 పాయింట్లు)
- రోహిత్ శర్మ: 40 (560 పాయింట్లు)
- కేఎల్ రాహుల్: 41 (553 పాయింట్లు)
- రవీంద్ర జడేజా: 50 (540 పాయింట్లు)
- నితీష్ రెడ్డి: 53 (528 పాయింట్లు)
ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్లు జోరూట్ (895 పాయింట్లు), హ్యారీ బ్రూక్ (876) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (867) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.