వరల్డ్ కప్ కి టీమిండియా జట్టు వచ్చేసింది. 15 మందితో కూడిన జట్టుని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ కి సెలక్ట్ చేసిన 18 మంది సభ్యుల్లో ముగ్గురు ప్లేయర్లను తగ్గించి మిగిలిన జట్టుని ప్రకటించారు. రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు శాంసన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణకి జట్టులో చోటు కోల్పోయారు. ఇదిలా ఉండగా సెలక్టర్ అజిత్ అగార్కర్ తో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే కాకుండా ఈ సారి రోహిత్ తన సహనాన్ని కోల్పోయాడు.
చెత్త ప్రశ్నలకు సమాధానాలు చెప్పను
సాధారణ మ్యాచులంటేనే ప్రెస్ వారు రకరకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. ఇక వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి జట్టుని ప్రకటిస్తే ఎందుకు వదులుతారు. ప్రతిసారి ఎంపిక చేయని ప్లేయర్లను ఎందుకు సెలక్ట్ చేయలేదని అడుగుతూ కెప్టెన్ సహనాన్ని పరీక్షిస్తారు. వీటికి కెప్టెన్లు కూడా చాలా ఓపిగ్గా సమాధానం చెబుతూ ఉంటారు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఈ సారి రూట్ మార్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "బయట నుంచి వాగే చెత్త వాగుడికి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. మేము ప్రొఫెషనల్స్. ఏం చేయాలో మాకు తెలుసు. ఇలాంటి చెత్త ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం చెప్పే ప్రసక్తే లేదు". అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
అత్యుత్తమ జట్టునే ప్రకటించాం
"అందుబాటులో ఉన్న టీం నుంచి బెస్ట్ టీంని సెలక్ట్ చేసాము. మా బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. మంచి స్పిన్నర్లతో పాటు, చాలా బౌలింగ్ వనరులు కూడా మా జట్టులో ఉన్నాయి. బాగా ఆడే 15 మందినే జట్టునే ప్రకటించాం. జట్టుకి మేలు చేసే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి. అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ జట్టులో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, రవి చంద్రన్ అశ్విన్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. అంతే కాదు యంగ్ ప్లేయర్లు సంజు శాంసన్, తిలక్ వర్మకు కూడా చోటు లభించలేదు. ఈ ప్రశ్నలు ఎదరవుతాయనే రోహిత్ బహుశా ముందుగానే ఇలాంటి సమాధానం ఇచ్చి ఉంటాడనే అభిప్రాయలు వ్యక్తమ అవుతున్నాయి.