అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సోమవారం(జూన్ 24) ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో 92 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పరుగుల వీరులు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజాంలను దాటేసి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
కరేబియన్ గడ్డపై రోహిత్ మెరుపులు మెరిపించాడు. పటిష్ట ఆసీస్ బౌలింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. ముఖ్యంగా ఆసీస్ త్రయం మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్‌లను ఊచకోత కోశాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో 29 పరుగులు రాబట్టిన హిట్‌మ్యాన్.. చివరకు 92 పరుగుల వద్ద అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ నాక్‌తో భారత కెప్టెన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(4145 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. 4103 పరుగులతో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు:
- 1. రోహిత్ శర్మ: 4165 పరుగులు
- 2. బాబర్ ఆజం: 4145 పరుగులు
- 3. విరాట్ కోహ్లీ: 4053 పరుగులు
- 4. పాల్ స్టిర్లింగ్: 3601 పరుగులు
- 5. మార్టిన్ గప్టిల్ : 3531 పరుగులు