IND vs ENG: గేల్‌ను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. చరిత్ర సృష్టించడానికి ఆ ఒక్కడే అడ్డు

IND vs ENG: గేల్‌ను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. చరిత్ర సృష్టించడానికి ఆ ఒక్కడే అడ్డు

అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు బౌండరీలు బాదడంలో రోహిత్ ముందే ఉంటాడు. ఇక సిక్సులు విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్ ఏదైనా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే సిక్సులు వర్షం కురవాల్సిందే. హిట్ మ్యాన్ 20,30 పరుగులు చేసినా వాటిలో కనీసం ఒకటి రెండు సిక్సులు ఉంటాయంటే అతనికి సిక్సులు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్ధం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా వన్డేల్లో క్రిస్ గేల్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. 

ALSO READ | IND vs ENG: ప్లేయర్లు పెవిలియన్‌కు.. ఆగిపోయిన భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఆడుతూ నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో గేల్ ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. గేల్ వన్డే కెరీర్ లో 331 సిక్సర్లు ఉంటే 335* సిక్సులతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు గేల్ తో సమానం ఉన్న రోహిత్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అట్కిన్సన్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి గేల్ ను అధిగమించాడు. ఆ తర్వాత మరో 3 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్ ప్రస్తుతం 54 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. 

పాకిస్థాన్ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిది వన్డేల్లో 351 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రోహిత్ మరో 17 సిక్సులు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా  11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు గిల్ (34), రోహిత్ శర్మ(54) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది.