టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటర్ గానే కాదు కెప్టెన్సీలోను అదరగొడుతున్నాడు. కోహ్లీ తర్వాత టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్.. మూడు ఫార్మాట్ లలో భారత్ కు నిలకడగా విజయాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు ఇంగ్లాండ్ పై జరగబోయే మ్యాచ్ రోహిత్ కు కెప్టెన్ గా 100 వ మ్యాచ్ కావడం విశేషం.
వరల్డ్ కప్ లో మరికాసేపట్లో ఇంగ్లాండ్- భారత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తన 100 వ మ్యాచ్ లో చిరస్మరణీయ విజయాన్ని అందుకే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 99 మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన రోహిత్.. 73 మ్యాచ్ ల్లో భారత్ కు విజయాన్ని అందించాడు. మరో 23 మ్యాచుల్లో ఓడగా.. నాలుగు మ్యాచులు డ్రాగా ముగిసాయి.
మొత్తంగా 74 శాతం విజయాలతో కోహ్లీ, ధోనీని రోహిత్ అధిగమించడం విశేషం. ధోనీ కెప్టెన్సీ చేసిన 332 మ్యాచుల్లో భారత్ 178 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కోహ్లీ 213 మ్యాచుల్లో టీమిండియాకు 135 విజయాలను అందించాడు. ధోనీ విజయాల శాతం 53.61 గా ఉంటే కోహ్లీ విజయాల శాతం 63.38 ఉంది. దీంతో కనీసం వంద మ్యాచ్ ల్లో కెప్టెన్సీ చేసిన లిస్ట్ చూసుకుంటే రోహిత్ అందరికంటే ముందున్నాడు.