Champions Trophy 2025: అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్.. స్పష్టం చేసిన జై షా

Champions Trophy 2025: అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్.. స్పష్టం చేసిన జై షా

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వ బాధ్యతలు చేపడతారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆ మెగా టోర్నీలో హిట్ మ్యాన్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌ చేరడం ఖాయమని.. అక్కడా విజయం సాధించి టీ20 ప్రపంచకప్ ఫలితాన్ని పునరావృతం చేస్తారని షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ చేరితే, అక్కడా రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

2024 టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్.. పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో తదుపరి భారత జట్టు తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో జై షా తన ప్రకటనతో అనుమానాలన్నింటిని పటాపంచలు చేశాడు. 

"ఈ విజయం తర్వాత మా తదుపరి లక్ష్యం WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము రెండు టోర్నమెంట్లను గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. చివరి ఐదు ఓవర్లు విజయానికి కీలకంగా నిలిచాయి. అందుకు నేను సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.."

"గతేడాది కాలంలో ఇది మూడవ ఐసీసీ ఫైనల్. జూన్ 2023లో WTC ఫైనల్‌లో ఓడిపోయాము. వన్డే ప్రపంచ కప్‌లో అదే పునరావృతం అయ్యింది. వరుసగా 10 విజయాలు సాధించినప్పటికీ, కప్‌ గెలవలేకపోయాము. ఆ సమయంలో నేనొకటి చెప్పా.. ఈసారి మనం హృదయాలను గెలుచుకోవడమే కాదు, కప్‌ కూడా గెలుచుకుంటామని రాజ్‌కోట్‌లో చెప్పాను.." అని షా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

పాక్ పర్యటనకు వెళ్తారా..!

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు.. పాకిస్తాన్ వెళ్తుందా..! లేదా అనేది స్పష్టం లేదు. ఆసియా కప్ టోర్నీ వలె భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారనే మాటలు వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు.. వచ్చే ఏడాది జూన్‌లో మూడో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌లో తలపడతాయి. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఫైనల్స్‌కి వెళ్లింది కానీ, గెలవలేదు. కానీ.. ఈసారి తప్పకుండా గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.