Champions Trophy 2025: ఐదుగురు కాదు ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు.. మీడియాపై రోహిత్ ఫైర్

Champions Trophy 2025: ఐదుగురు కాదు ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు.. మీడియాపై రోహిత్ ఫైర్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల జట్టులో భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్పిన్నర్లు. ఈ మెగా టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్ లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇక్కడ పిచ్ లు స్పిన్నర్లకు సరిగా అనూకూలించవు. అయినప్పటికీ భారత్ ఐదుగురు స్పిన్నర్లతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగడం ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ విషయంపై బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ లో నేడు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఒకరోజు ముందు మీడియాతో రోహిత్ మాట్లాడాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దుబాయ్ లో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు అనే ప్రశ్నకు రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. తమ జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారని మిగిలిన ముగ్గురు ఆల్ రౌండర్లు అని రోహిత్ తెలిపాడు. 

రోహిత్ మాట్లాడుతూ.. " మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మిగతా ముగ్గురు ఆల్ రౌండర్లు. నేను ఐదుగురు స్పిన్నర్లుగా వారిని  చూడటం లేదు. ఆ ముగ్గురు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలరు. జడేజా, అక్షర్, సుందర్ ఆల్ రౌండర్లు. కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్లు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కంటే ఆల్ రౌండర్లకే జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం".అని టీమిండియా కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు.