Kohli-Rohit: ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు కోహ్లీ, రోహిత్

Kohli-Rohit: ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు కోహ్లీ, రోహిత్

ఎవరన్నారు వయసైపోతుంది అని.. ఎవరన్నారు ఫిట్ నెస్ లేదని.. ఎవరన్నారు ఫామ్ లేదని.. ఎవరన్నారు రిటైర్మెంట్ అవ్వాలని.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వస్తున్న విమర్శలకు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చూపించి చెక్ పెట్టారు. జట్టుకు అనుభవం ఎంత కీలకమో తెలిసేలా చేశారు. కీలకమైన సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే.. ఫైనల్లో న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ 76 పరుగులు చేసి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని రోకో జోడీ తేల్చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ తో సంతోషంలో తేలిపోయిన భారత క్రికెట్ అభిమానులకు మరింత కిక్కునిచ్చే వార్త ఇది. వన్డే క్రికెట్ లో రోహిత్, కోహ్లీ మరికొంత కాలం కొనసాగనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ స్టాప్ పెట్టాడు. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తన దగ్గర ఫ్యూచర్ ప్లాన్ లేదన్నాడు. మరోవైపు కోహ్లీ సైతం రిటైర్మెంట్ పై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీంతో రోహిత్, కోహ్లీ ఎప్పటివరకు వన్డే క్రికెట్ లో కొనసాగుతారో ఇప్పుడు చూద్దాం. 

టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్‌:

రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే వీరు టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే, టెస్ట్ ఫార్మాట్ పై దృష్టి పెట్టనున్నారు. వీరి టెస్ట్ కెరీర్ విషయాన్ని పక్కన పెడితే వన్డేల్లో మాత్రం వీరి ప్రధాన టార్గెట్ సౌతాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్. హిట్ మ్యాన్, విరాట్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క వన్డే వరల్డ్ కూడా రాలేదు. ఇద్దరూ కలిసి మూడు వరల్డ్ కప్ లు ఆడినా జట్టుకు వరల్డ్ కప్ అందించాలేకపోయామనే బాధ వీరిలో అలాగే ఉంది. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన  2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం వీరిని తీవ్రంగా బాధిస్తుంది. 

వయసు మీద పడుతున్నా ఆటలో మాత్రం రోహిత్, కోహ్లి తిరుగులేని ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. చెరో నాలుగు ఐసీసీ టోర్నీలను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొట్టారు. భారత్ కు వన్డే వరల్డ్ కప్ సాధిస్తే వీరు సంతోషంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్, రోహిత్ బ్యాట్ తో అదరగొట్టారు. పాకిస్థాన్ పై విరాట్ అజేయ శతకం సాధించాడు. 5 ఇన్నింగ్స్ ల్లో కోహ్లి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ కూడా సత్తాచాటాడు. 5 మ్యాచ్ ల్లో 180 పరుగులు చేశాడు. కీలకమైన ఫైనల్లో 76 పరుగుల ఇన్నింగ్స్ తో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.