IND Vs PAK: పాక్ బౌలర్‌పై రోహిత్ చెత్త రికార్డ్.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్

IND Vs PAK: పాక్ బౌలర్‌పై రోహిత్ చెత్త రికార్డ్.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్

స్వదేశంలో  ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నా పాకిస్థాన్ కు తొలి మ్యాచ్ లో నిరాశ తప్పలేదు. టోర్నీ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆదివారం (ఫిబ్రవరి 23) జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. దుబాయ్ వేదికగా జరగనున్న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ పాక్ జట్టుకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నా.. దుబాయ్ లో పాకిస్థాన్ కు అద్భుత రికార్డ్ ఉంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తేనే రోహిత్ సేన దాయాధి జట్టును ఓడించగలదు.

దుబాయ్ లో భారత్ పై పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ రికార్డ్ తో పాటు మరో రికార్డ్ కూడా టీమిండియా ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది బౌలింగ్ లో రోహిత్ కు చెత్త రికార్డ్ ఉండడమే ఇందుకు కారణం. అఫ్రిది బౌలింగ్ లో రోహిత్ రెండు సార్లు ఔటయ్యాడు. అఫ్రిది బౌలింగ్ లో ఓవరాల్ గా 56 బంతుల్లో 48 పరుగులే చేసి రెండు సార్లు ఔటయ్యాడు. 2021 టీ20 వరల్డ్ కప్ లో.. 2023 ఆసియా కప్ లో అఫ్రిది బౌలింగ్ లో హిట్ మ్యాన్ ఔటయ్యాడు. దీంతో మరోసారి కొత్త బంతితో రోహిత్ శర్మను ఔట్ చేయాలని అఫ్రిది భావిస్తున్నాడు. 

బంగ్లాదేశ్‌‌పై భారీ విజయంతో చాంపియన్స్ ట్రోఫీ వేటను ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ బెర్తుపై గురి పెట్టింది.గ్రూప్‌‌–ఎలో భాగంగా ఆదివారం ఇక్కడి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌ స్టేడియంలో జరిగే మెగా మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌‌తో గెలిస్తే రోహిత్‌‌సేన సెమీఫైనల్‌‌ చేరుకోనుంది. ఈ పోరులో ఓడితే మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాక్‌‌ గ్రూప్‌‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు చివరగా 2017 టోర్నీ ఫైనల్లో తలపడ్డాయి. నాడు లండన్‌‌లో టీమిండియాను ఓడించిన పాక్‌‌ ట్రోఫీ సొంతం చేసుకుంది.