IND vs AUS: నలుగురు స్పిన్నర్లా లేక ఇద్దరు పేసర్లా: బౌలింగ్ కాంబినేషన్‌పై రోహిత్ హింట్

IND vs AUS: నలుగురు స్పిన్నర్లా లేక ఇద్దరు పేసర్లా: బౌలింగ్ కాంబినేషన్‌పై రోహిత్ హింట్

ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం (మార్చి 4) ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీ ఫైనల్ కు భారత్ ఎలాంటి బౌలింగ్ దళంతో బరిలోకి దిగుతుందో గందరగోళంగా మారింది. బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు లేకపోయినా బౌలింగ్ లో మాత్రం రోహిత్ సేన  ఒక అంచనాకు రాలేకపోతుంది. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా లేకపోతే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు.. ముగ్గురు స్పిన్నర్లతో మ్యాచ్ ఆడే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లతోనే సెమీ ఫైనల్ ఆడొచ్చని హింట్ ఇచ్చాడు.     

ఆస్ట్రేలియాతో సెమీస్ కు ముందు రోహిత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో వివరణ ఇచ్చాడు. నలుగురు స్పిన్నర్లతో తుది జట్టు ఉంటుందని చెప్పకనే చెప్పాడు. " సెమీ ఫైనల్లో నలుగురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటున్నా. నలుగురు స్పిన్నర్లను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. సరైన కాంబినేషన్ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం". అని ఆసీస్‌తో మ్యాచ్ ముందు రోజు రోహిత్ అన్నాడు.

ALSO READ : IND vs AUS: బాగా ఆడినోళ్లదే విజయం: ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్‌కు కొత్త పిచ్

తొలి రెండు మ్యాచుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన భారత్.. అనూహ్యంగా కివీస్‌పై నలుగురిని రంగంలోకి దింపి మంచి ఫలితం సాధించింది. ఇందులో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. ఇదే జట్టును ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో బరిలోకి దింపొచ్చు. న్యూజిలాండ్ పై వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. దాంతో, అతన్ని తప్పించే ఆలోచన ఉండకపోవచ్చు. ఒకవేళ హర్షిత్ రానాను ఆడించాలనుకుంటే కుల్దీప్ బెంచ్ కు పరిమితం చేయొచ్చు. కుల్దీప్ ను కొనసాగిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ 11 లో చోటు దక్కకపోవచ్చు. బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

తుది జట్లు(అంచనా)

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా:

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.