IPL Retention 2025: రోహిత్ ఎంత గొప్ప మనసు.. నాలుగో రిటైన్ ప్లేయర్‌పై స్పందించిన హిట్ మ్యాన్

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే. అంబానీ ఉన్నా.. సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా రోహిత్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. 10 ఏళ్ళ నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్ గా జట్టుకు 5 ట్రోఫీలు అందించిన ఘనత హిట్ మ్యాన్ కే దక్కుతుంది.    

2024 ఐపీఎల్ కు వచ్చేసరికి ఎవ్వరూ ఊహించని విధంగా ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు  బాధ్యతలు అప్పగించింది. పాండ్యను కెప్టెన్ గా ప్రకటించినా రోహిత్ సంతృప్తిగానే ఉన్నాడు. తాజాగా మరోసారి హిట్ మ్యాన్ తన గొప్ప మనసును చాటుకున్నాడు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ లాంటి ఆటగాడిని నాలుగో రిటైన్ ఆటగాడిగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఈ విషయంపై రోహిత్ సానుకూలంగా స్పందించాడు. జియో సినిమాతో మాట్లాడుతూ రోహిత్ ఇలా అన్నాడు.. "నేను టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాను కాబట్టి నా రిటైన్ విషయంలో సంతృప్తి చెందుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉండాలి. నేను దానిని నమ్ముతాను". అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 

ముఖ్యంగా కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఆ జట్టుతోనే కొనసాగడంతో రోహిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ కు రోహిత్ ఆడడనే వార్తలు గత కొంతకాలంగా బాగా వైరల్ అయ్యాయి. ఐపీఎల్ 2025 కు సంబంధించి ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్ల  విషయానికి వస్తే.. అందరూ ఊహించనట్టుగానే స్టార్ ఆటగాళ్లందరూ ముంబై ఇండియన్స్ తోనే ఉన్నారు. బుమ్రాకు రూ. 18 కోట్లు, హార్దిక్ పాండ్యకు రూ.16.35 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ కు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మ రూ. 16 కోట్లు.. తిలక్ వర్మ కు రూ. 8 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్య కెప్టెన్ గా కొనసాగనున్నాడు.