వరల్డ్ కప్ ఫైనల్ 2023 ఓటమి అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో కనిపించని విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. దీంతో అతడు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు తదుపరి కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వన్డే, టెస్ట్, టీ20 మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉండాలని చెప్పిన గంగూలీ, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసేంతవరకు అతన్నే కెప్టెన్‌గా కొనసాగిస్తే మంచి ఫలితాలు రాబట్టగలమని అభిప్రాయపడ్డారు. "జట్టులో సీనియర్ ఆటగాళ్లు కనిపించకపోవడం వల్ల అందరికీ కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. టీ20 కెప్టెన్‌గా సూర్య(సూర్యకుమార్ యాదవ్)ను ఎంపికయ్యాడు. అయితే, వన్డేల్లో అతడి స్థానంపై స్పష్టత లేదు. అందువల్ల 50 ఓవర్ల క్రికెట్‌కు మరో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇక రోహిత్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడు కాబట్టి అతనే కెప్టెన్‌గా కొనసాగించారు.. "
"ప్రపంచ కప్‌లు ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే భిన్నంగా ఉంటాయి.. ఎందుకంటే ఒత్తిడి భిన్నంగా ఉంటుంది. వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ కెప్టెన్సీ బాగుంది. అతని సారథ్యంలో భారత జట్టు అద్భుతంగా ఆడింది. అతడు గొప్ప నాయకుడు. ఆఖరి ఫలితాన్ని పక్కనపడితే జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. అది ముగిసేంత వరకు అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్‌గా ఉండాలి. అతనే కెప్టెన్‌గా కొనసాగుతాడని నేను ఆశిస్తున్నా.. అప్పుడే అనుకున్న పలితాలు రాబట్టగలం.." అని గంగూలీ కెప్టెన్సీ మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ముగ్గురు కెప్టెన్లు
కాగా, డిసెంబర్ నెలలో భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ వేరు వేరు కెప్టెన్లను నియమించింది. టీ20లకు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహించనుండగా, వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.