Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ

ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆదివారం (జనవరి 19) 50వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి ముంబై దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు.  ఐకానిక్ గ్రౌండ్‌లో మాజీ క్రికెటర్లు తమ మధుర జ్ఞాపకాలను.. అనుభవాలను పంచుకున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ గ్రాండ్ వేడుకలో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడాడు. మిలియన్ల కొద్దీ అభిమానుల ఆశలను రేకెత్తిస్తూ  ఛాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో అడుగుపెడతామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.       

ALSO READ | IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా

రోహిత్ మాట్లాడుతూ.. “ఐసీసీ టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ కల. దుబాయ్‌కి వెళ్లినప్పుడు మేము మరొక కలని ప్రారంభిస్తాము. 140 కోట్ల మంది ప్రజలు మా వెంటే ఉంటారని, అడుగడుగునా మాకు అండగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ట్రోఫీని వాంఖడేకు తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము". ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. 

2013 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. అప్పుడు ప్లేయర్ గా రోహిత్ శర్మ భారత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈసారి బ్యాటర్ గా.. కెప్టెన్ గా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (BCCI)  రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది.స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అలాగే, వన్డే ప్రపంచ కప్ అనంతరం జట్టుకు దూరమైన మరో భారత పేసర్ మహ్మద్ షమీ జట్టులో చోటు సంపాదించాడు.