- కేఎల్ రాహుల్ ఫెయిల్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ధ్రువ్ జురెల్ (80) మెరిసినా.. భారీ ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ (4)తో సహా మిగతా వారు ఫెయిల్ కావడంతో.. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 161 రన్స్‌కే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను ఆసీస్ పేసర్ మైకేల్ నాసెర్ (4/27) వణికించాడు. తొలి ఓవర్‌లో వరుస బాల్స్‌లో అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్ (0)ను ఔట్ చేశాడు. రెండో ఓవర్‌లో బోలాండ్ (1/51) దెబ్బకు రాహుల్ వెనుదిరగగా, మూడో ఓవర్‌లో రుతురాజ్ (4)ను నాసెర్ మళ్లీ దెబ్బకొట్టాడు.
దీంతో 11/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇండియాను దేవదుత్ పడిక్కల్ (26), జురెల్ ఐదో వికెట్‌కు 53 రన్స్ జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆసీస్ బౌలర్లు ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు. 25వ ఓవర్‌లో పడిక్కల్ ఔట్ కావడంతో వికెట్ల పతనం వేగంగా సాగింది. నితీశ్ కుమార్ (16), తనుష్ కొటియాన్ (0), ఖలీల్ అహ్మద్ (1), ప్రసిధ్ కృష్ణ (14), ముకేశ్ కుమార్ (5 నాటౌట్) విఫలమయ్యారు.
బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్–ఎ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 17.1 ఓవర్లలో 53/2 స్కోరు చేసింది. మార్కస్ హారిస్ (26 బ్యాటింగ్), సామ్ కొన్‌స్టాస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేథన్ మెక్‌స్వీని (14), కామెరూన్ బ్యాంక్రాఫ్ట్ (3) నిరాశపర్చారు. ముకేశ్, ఖలీల్ చెరో వికెట్ తీశారు.