న్యూఢిల్లీ: వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా తరఫున ఇకపై టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన నేపథ్యంలో రోహిత్ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడి జట్టును గెలిపించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, భవిష్యత్తులో రోహిత్ షార్ట్ ఫార్మాట్ ఆడబోడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్‌మ్యాన్ ఒక్క టీ20 కూడా ఆడలేదు. హార్దిక్ పాండ్యానే టీ20 టీమ్‌ను నడిపిస్తున్నాడు. ‘వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టడంతో ఏడాది నుంచి రోహిత్ టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్‌తో సుదీర్ఘ చర్చలు జరిపాడు. ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటానని చెప్పాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షార్ట్‌ఫార్మాట్‌లో గిల్, జైస్వాల్, ఇషాన్, రుతురాజ్ రూపంలో ఇండియాకు నలుగురు ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ ఈ యంగ్‌స్టర్స్ రాణించకపోతే సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు రోహిత్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని ఆడిగే చాన్సుంది.
అయితే, వయసు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోహిత్ తన వర్క్‌లోడ్‌పై ఫోకస్ పెట్టి, గాయాల పాలవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తను ఐపీఎల్‌తో పాటు మూడు ఫార్మాట్లలో ఇండియాకు ఆడటం అసాధ్యమే అనొచ్చు. వచ్చే మార్చి వరకు టీమిండియా ఏడు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ రెడ్ బాల్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నాడు. 2025లో జరిగే డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో గెలిచి ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకునే అవకాశం రోహిత్‌ను ఊరిస్తోంది. ఇక, సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో షమీ, సిరాజ్‌తో కలిసి బుమ్రా ఇండియా పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో ఐదు వారాల వ్యవధిలో ఐదు టెస్టులు ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురినీ రొటేట్ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.